Share News

వామ్మో నేపాలీలు.. పక్కాగా స్కెచ్‌ వేసి.. రూ.కోట్లు కొట్టేస్తున్న ముఠాలు

ABN , Publish Date - May 14 , 2026 | 07:43 AM

నేపాలీలు.. ఈ పేరు వింటేనే నగరంలో ఇంటి యజమానులు ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్‏లో వెలుగులోకి వస్తున్న వరుస చోరీ ఘటనలే ఇందుకు కారణం.

వామ్మో నేపాలీలు.. పక్కాగా స్కెచ్‌ వేసి.. రూ.కోట్లు కొట్టేస్తున్న ముఠాలు
Nepal Gangs

  • నగరంలో ఏడాదిలో ఆరు దోపిడీలు.. మత్తులో ముంచి మెత్తగా దోచేస్తున్న వైనం

  • జూబ్లీహిల్స్‌, జవహర్‌నగర్‌ ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

  • నేపాలీయుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. ఇతర రాష్ట్రాల దొంగలపైనా ఆరా

హైదరాబాద్‌ సిటీ: నేపాలీలు.. ఈ పేరు వింటేనే నగరంలో ఇంటి యజమానులు ఉలిక్కిపడుతున్నారు. నగరంలో వెలుగులోకి వస్తున్న వరుస చోరీ ఘటనలే ఇందుకు కారణం. జూబ్లీహిల్స్‌లో మాజీ డీజీపీ భార్యను హత్య చేసి, ఇంటిని దోచేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇది జరిగిన నాలుగు రోజులకే జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో మరో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వృద్ధ దంపతుల ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీలు 13 రోజులకే భారీ దోపిడీకి తెగబడ్డారు. మరో ముగ్గురు నేపాలీలను పిలిపించి, వృద్ధ దంపతులకు మత్తు మందు కలిపిన కేక్‌ తినిపించి, చేతులు కాళ్లు కట్టేశారు. ఆపై బీరువాలో ఉన్న 75 తులాల బంగారం, 20 కేజీల వెండి, కొంత నగదు తీసుకొని పారిపోయారు. ఒకవైపు జూబ్లీహిల్స్‌ కేసులో నేపాలీ ముఠా కోసం పోలీసులు గాలిస్తుండగానే.. మరో నేపాల్‌ ముఠా దోపిడీకి తెగబడటంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


లెక్క తీస్తున్న పోలీసులు

నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో పనివాళ్లుగా, వాచ్‌మెన్‌లుగా, ఇతర పనుల్లో చేరిన నేపాలీల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సెక్టార్ల వారీగా తిరుగుతూ నగరంలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏఏ పనులు చేస్తున్నారు, ఎంతకాలంగా ఉంటున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. నేపాలీలు మీ వద్ద పనిచేస్తున్నా, అద్దెకు ఉన్నా, ఎప్పుడైనా పనిలో పెట్టుకోవాలని భావించినా తప్పనిసరిగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు అందజేయాలని ఇంటి, ఆఫీసు యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. నేపాలీలు ఉన్న ఇళ్లలో యజమానులతో మాట్లాడి వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు, ప్రాంతం, ఎంతకాలంగా పనిచేస్తున్నారు, ఎవరి ద్వారా వచ్చారు, నేపాల్‌లో వారి అడ్రస్‌, నేరచరిత్ర, ఫింగర్‌ ప్రింట్స్‌, ఐరిష్‌, ముఖ కవలికలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. నేపాలీలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు సైతం సేకరిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.


ఏడాదిలో ఆరు ఘటనలు

గతేడాది మేలో కాచిగూడలో నేపాల్‌ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానులకు భోజనంలో మత్తు మందు కలిపి, ఇంట్లో ఉన్న బంగారం, వజ్రాలు, వెండి, నగదు సహా రూ. 1.50 కోట్ల సొత్తుతో పరారయ్యారు. నేటీకీ ఆ దొంగల ముఠా పోలీసులకు చిక్కలేదు.

దోమలగూడలో..

గతేడాది దోమలగూడ పరిధిలోని ఓ ఇంట్లో పనికి చేరిన నేపాల్‌ దొంగలు చోరీకి పాల్పడ్డారు. వృద్ధులకు మత్తు మందు ఇచ్చి దోపిడీ చేశారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు పట్టుకున్నారు.


city1.jpgజూబ్లీహిల్స్‌లో మూడు ఘటనలు

జూబ్లీహిల్స్‌ పరిధిలో 3 నెలల వ్యవధిలో నేపాలీలు మూడు భారీ దోపిడీలు చేశారు. ఫిబ్రవరిలో నందగిరిహిల్స్‌లో సుమారు రూ.2 కోట్ల సొత్తు దోచేశారు. మార్చిలో మరో ముఠా ఇంటి యజమానులు లేని సమయంలో రూ. 1.50 కోట్ల సొత్తును కాజేశారు. తాజాగా ప్రశాసన్‌ నగర్‌లో పనిమనిషి కల్పన ముఠా.. మాజీ డీజీపీ భార్యను హత్య చేసి, ఇంట్లో భారీ దోపిడీకి పాల్పడి ఉడాయించింది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే జవహర్‌నగర్‌ పరిధిలో మరో నేపాల్‌ ముఠా రెచ్చిపోయింది. పనిలో చేరిన 13 రోజులకే ప్రొఫెసర్‌, డాక్టర్‌ దంపతులకు కేక్‌లో మత్తు కలిపి ఇచ్చి 75 తులాల బంగారం, 20 కేజీల వెండి, నగదు దోచుకొని పారిపోయారు. ఈ ముఠాలో ఐదుగురు నేపాల్‌ దొంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దొంగలు ఇప్పటికే నేపాల్‌ చేరుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 07:43 AM