మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం
ABN , Publish Date - May 14 , 2026 | 04:36 AM
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన కరీంనగర్ వన్ ఆసుపత్రిలో ...
కరీంనగర్ ఆస్పత్రిలో లిఫ్ట్‌లో వెళుతుండగా తెగిపోయిన వైరు
మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా జారిపోయిన లిఫ్ట్
క్షేమంగా బయటపడ్డ మంత్రి
సుభాష్ నగర్ (కరీంనగర్), మే 13 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన కరీంనగర్ వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన రైతును పరామర్శించేందుకు వచ్చారు. మూడో అంతస్తుకు వెళ్లేందుకు అడ్లూరి తన పీఏ, ఇద్దరు గన్‌మెన్‌తో కలిసి లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మొదటి అంతస్తుకు చేరిన తర్వాత వైరు తెగిపోయింది. దీంతో లిఫ్టు ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు జారిపోయింది. లిఫ్టులో ఉన్న అడ్లూరి, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. లిఫ్ట్‌కు మాన్యువల్ డోర్లు ఉండడంతో తెరుచుకుని బయటకొచ్చారు. ఆస్పత్రి సిబ్బందిపై అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేకుండా ఆస్పత్రులను ఎలా నిర్వహిస్తున్నారని నిలదీశారు. దీనిపై విచారణ చేపట్టాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై దృష్టి సారించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొదటి అంతస్తులో ఉండగా వైరు తెగిపడడంతో ప్రమాదం నుంచి బయటపడ్డామని, అదే మూడో అంతస్తులో ఉండగా జరిగితే పరిస్థితి తీవ్రంగా ఉండేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని, ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.