Share News

రూ.1000 కోసం హత్య

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:49 AM

నగరంలో వెయ్యి రూపాయల కోసం ఒకరిని చంపేశారు. ఓ రిక్రూట్‌మెంట్‌ సంస్థ నిర్వాహకుడు తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.

రూ.1000 కోసం హత్య

  • ఓ రిక్రూట్‌మెంట్‌ సంస్థ నిర్వాహకుడిని చంపేసిన వ్యక్తి

  • రూ.2,500 చెల్లించిన నల్లగొండ వ్యక్తికి ఉద్యోగం చూపించిన నిర్వాహకుడు

  • ఆ ఉద్యోగం మానేసి తాను చెల్లించిన డబ్బు తిరిగిమవ్వని డిమాండ్‌

  • రూ.1500 వెనక్కి ఇచ్చేయగా.. మిగిలిన వెయ్యి కోసం గొడవ, హత్య

  • హైదరాబాద్‌లో ఘటన.. పరారీలో నిందితుడు

హైదరాబాద్: నగరంలో వెయ్యి రూపాయల కోసం ఒకరిని చంపేశారు. ఓ రిక్రూట్‌మెంట్‌ సంస్థ నిర్వాహకుడు తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సంస్థ ద్వారా ఉద్యోగంలో చేరిన ఓ వ్యక్తి.. తనకు పని నచ్చలేదని, తాను చెల్లించిన డబ్బు తిరిగివ్వాలని అడగ్గా.. సంస్థ నిర్వాహకుడు రూ.1000 బకాయి పడ్డాడు. ఆ రూ.వెయ్యి కోసం గొడవ పడిన సదరు వ్యక్తి.. రిక్రూట్‌మెంట్‌ సంస్థ నిర్వాహకుడిని కిరాతకంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటనలో వారాహి మ్యాన్‌ పవర్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ నిర్వాహకుడు ఏపీలోని ఏలూరుకు చెందిన జే శశికిరణ్‌ రెడ్డి(36) హత్యకు గురయ్యాడు.


పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివాసముండే జె. శశికిరణ్‌రెడ్డి మధురానగర్‌లో వారాహి మ్యాన్‌పవర్‌ రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. నల్గగొండ(Nalgagonda)కు చెందిన ప్రభుకుమార్‌ ఉద్యోగం కోసం వారాహి కన్సల్టెన్సీని సంప్రదించాడు. తమకు రూ.2,500 చెల్లిస్తే ఉద్యోగం చూపిస్తానని శశికిరణ్‌ రెడ్డి చెప్పగా.. ప్రభుకుమార్‌ ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఇచ్చిన మాట ప్రకారం శశికిరణ్‌ బంజారాహిల్స్‌లోని హిల్టన్‌ కంపెనీలో ఫిబ్రవరి 24న ప్రభుకుమార్‌ను ఉద్యోగంలో చేర్పించాడు. రెండ్రోజులు అక్కడ విధులు నిర్వర్తించిన ప్రభుకుమార్‌... శశికిరణ్‌ వద్దకు తిరిగొచ్చి తనకు పని నచ్చలేదని తన డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.


దీంతో శశికిరణ్‌ రూ.1500 తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన రూ.1000 కోసం ప్రభుకుమార్‌ పలుమార్లు వారాహి కార్యాలయానికి వెళ్లాడు. తనపై పాత కేసులు ఉన్నాయని, డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని శశికిరణ్‌ను పలుమార్లు బెదిరించాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలప్పుడు వారాహి కార్యాలయానికి వచ్చిన ప్రభుకుమార్‌.. అక్కడ పనిచేసే లయ అనే ఉద్యోగినితో మాట్లాడి శశికిరణ్‌ ఉన్న గది(క్యాబిన్‌)లోకి వెళ్లాడు. రూ.1000 కోసం ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆ గదికి లోపల నుంచి గడియ పెట్టిన ప్రభుకుమార్‌... వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్‌రెడ్డి మెడపై దాడి చేశాడు.


zz.jpgశశికిరణ్‌ రెడ్డి అరుపులు విన్న కార్యాలయ సిబ్బంది తలుపులు కొట్టారు. అయితే, శశికిరణ్‌రెడ్డిని విచక్షణారహితంగా పొడిచిన ప్రభుకుమార్‌ అదే కత్తిని బయట ఉన్న వారికి చూపెడుతూ తలుపు గడియ తీశాడు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసిన కార్యాలయ ఉద్యోగిని లయపై దాడి చేసిన ప్రభుకుమార్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో శశికిరణ్‌ రెడ్డి మరణించగా.. లయ ఎడమ చేతి భుజానికి గాయమైంది. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... శశికిరణ్‌ రెడ్డి భార్య నాగ భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ప్రభుకుమార్‌ కోసం గాలింపు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘రాయనపాడు’ రాజసం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 11 , 2026 | 07:08 AM