చదువు వదిలేసి డ్రగ్స్ దందా
ABN , Publish Date - Apr 08 , 2026 | 07:53 AM
ఆ విద్యార్థులు చదువు మధ్యలో ఆపేశారు. ఈజీ మనీకి అలవాటుపడి మాదక ద్రవ్యాల సరఫరా చేసే స్మగ్లర్స్‌గా మారారు.
ఐదుగురు యువకుల అరెస్ట్..
రూ.63.65 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్
హైదరాబాద్ సిటీ: ఆ విద్యార్థులు చదువు మధ్యలో ఆపేశారు. ఈజీ మనీకి అలవాటుపడి మాదక ద్రవ్యాల సరఫరా చేసే స్మగ్లర్స్‌గా మారారు. నగరంలోని మూడు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద ఎండీఎంఏ, ఓజీ గంజాయి, హాషిష్ ఆయిల్ సహా.. మొత్తం రూ. 63.65 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌న్యూ ఇన్‌స్పెక్టర్లు వెంకట్, బాలాస్వామి, ఎస్‌ఐ వెంకటరాములు, మనోజ్ కుమార్‌లతో కలిసి హెచ్‌న్యూ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
చిలకలగూడలో ఎండీఎంఏ డ్రగ్స్
చిలకలగూడలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న సాయి నిఖిల్ అలియాస్ సాయిని హెచ్‌న్యూ పోలీసులు, చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్‌కు చెందిన సాయి (18) ఇంటర్ చదువును మధ్యలో ఆపేశాడు. ఈజీమనీకి అలవాటుపడి డ్రగ్స్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాడు. సీనియర్ స్మగ్లర్ ఆదిత్య వద్ద డ్రగ్స్ తీసుకొని వినియోగదారులకు సరఫరా చేసేవాడు. గతంలో జీడిమెట్లలో నమోదైన కేసులో పరారీలో ఉన్నాడు. ఇప్పుడు చిలకలగూడలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు.
సనత్‌నగర్‌లో హాషిష్ ఆయిల్
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సాయిబు కూడా చదువును మధ్యలో ఆపేశాడు. బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి సూరారంలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో స్నేహితుల సహకారంతో గంజాయి, హాషిష్ ఆయిల్ సరపరా చేయడం ప్రారంభించాడు. కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్మేవాడు. అతడితో పాటు మరో సబ్ పెడ్లర్ వేణును అరెస్టు చేశారు.
కొరియర్ ద్వారా సింథటిక్ డ్రగ్స్..
కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి నగరంలో సరఫరా చేస్తున్న అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన అక్షయ పటేల్, ఎల్‌బీనగర్‌కు చెందిన ఆదిత్యలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశామని, త్వరలోనే రిహాబిలిటేషన్‌కు పంపిస్తామని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తామని డీసీపీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News