పిండి, కొవ్వులతో కల్తీ పనీర్ తయారీ
ABN , Publish Date - Jun 19 , 2026 | 09:20 AM
పిండి పదార్థాలు, వెజిటెబుల్ ఫ్యాట్స్ (వనస్పతి కొవ్వులు), ఇతర కొవ్వు ఉత్పత్తులతో కల్తీ పనీర్‌ను తయారు చేస్తున్న కేంద్రాలు, విక్రయ దుకాణాలపై హెచ్‌ఫాస్టు పోలీసులు దాడులు చేశారు.
మిల్క్ పనీర్‌గా నమ్మించి విక్రయాలు
తయారీ యూనిట్లు, 45 అవుట్‌లెట్లపై దాడులు
5 క్వింటాళ్ల కల్తీ పనీర్ సీజ్
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు: డీసీపీ
హైదరాబాద్ సిటీ: పిండి పదార్థాలు, వెజిటెబుల్ ఫ్యాట్స్ (వనస్పతి కొవ్వులు), ఇతర కొవ్వు ఉత్పత్తులతో కల్తీ పనీర్‌ను తయారు చేస్తున్న కేంద్రాలు, విక్రయ దుకాణాలపై హెచ్‌ఫాస్టు పోలీసులు దాడులు చేశారు. 45 అవుట్‌లెట్‌లు, 8 తయారీ కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి 8.25 క్వింటాళ్ల కల్తీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌ఫాస్టు డీజీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం వెజిటబుల్ ఫ్యాట్స్, పాలు కాని ఇతర పదార్థాలతో తయారు చేయబడిన ‘చీజ్ అనలాగ్’ ఉత్పత్తులను, సరైన ప్రకటన, సమాచారం లేకుండా పనీర్, మలై పనీర్, మిల్క్ పనీర్‌గా నమ్మించి విక్రయిస్తున్నట్లు అధికారుల దృష్టికొచ్చింది.
పనీర్ తయారీ, విక్రయ అవుట్‌లెట్లపై దాడులు నిర్వహించాం. కొందరు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు చీజ్ అనలాగ్‌ను నగరంలోని తయారీదారుల నుంచి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ నుంచి సేకరించి పనీర్‌గా విక్రయిస్తున్నారు. ఇదే ఉత్పత్తిని ‘లో ఫ్యాట్ పనీర్’, ‘మీడియం ఫ్యాట్ పనీర్’, ‘ఫ్రెష్ పనీర్’ వంటి తప్పుదోవ పట్టించే లేబుళ్లతో మార్కెట్ చేస్తునట్లు గుర్తించారు.. కొన్ని సందర్భాల్లో తయారీ వివరాలు, బ్యాచ్ నంబరు, ఎక్స్‌పైరీ డేట్ లేకుండానే విక్రయిస్తున్నారు. మరికొన్ని కేసుల్లో పుడ్ బిజినెస్ ఆపరేటర్లు పనీర్ కోసం ఆర్డర్ ఇస్తే వారికి ప్రత్యామ్నాయంగా ఈ చీజ్ అనలాగ్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
మరికొంతమంది తయారీదారులు రిటైల్ షాపుల యజమానులు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. నిర్దిష్ట ఎఫ్‌బీవో (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు)లు చీజ్ అనలాగ్‌ను పెద్ద మొత్తంలో (బల్క్‌గా) కొనుగోలు చేసి, ఎలాంటి లైసెన్స్, సరైన ప్రకటన, ట్రేసబిలిటీ లేకుండా ‘ప్రీమియం పనీర్’ అంటూ తప్పుదోవ పట్టించే లేబుళ్లతో ప్యాకింగ్ చేస్తున్నారు. పనీర్‌లో పిండి పదార్థం (స్టార్చ్), అధిక నీరు, కొవ్వులు, నాణ్యత లేని సింథటిక్ పాలు, నాన్-ఫుడ్-గ్రేడ్ రసాయనాలను ఉపయోగించడం వంటి కల్తీ పద్థతులు తనిఖీలలో వెలుగులోకొచ్చాయి. లేబులింగ్ లేకపోవడం, గడువు ముగిసినవి, లైసెన్సులు లేకుండా, అనారోగ్యకరమైన నిల్వ పద్థతులు వంటి నిబంధనల ఉల్లంఘనలను పోలీసులు గుర్తించారు.
ఈ అకస్మిక దాడులలో సుమారు 45 అవుట్‌లెట్లు, 8 తయారీ విభాగాలను తనిఖీ చేసి సుమారు 825 కిలోల కల్తీ బ్రాండింగ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కల్తీ ఉత్పత్తులను వాడితే తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఇకపై కఠినమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విశ్లేషణ కోసం నమూనాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యంతతో చెలగాటమాడేలా ఇలా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మెడికవర్ హాస్పిటల్స్‌పై కేకేఆర్ కన్ను!
బంగారం దిగుమతులు 70 శాతం డౌన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News