మెడికవర్ హాస్పిటల్స్‌పై కేకేఆర్ కన్ను!
ABN , Publish Date - Jun 19 , 2026 | 06:01 AM
దేశంలోని మరో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా కేంద్రంగా ఉన్న ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థ కేకేఆర్..
మెజారిటీ వాటా కోసం చర్చలు
రూ.9,900 కోట్లు చెల్లించేందుకు రెడీ !
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశంలోని మరో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా కేంద్రంగా ఉన్న ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థ కేకేఆర్.. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ వార్తా కథనం వెల్లడించింది. ఈ నెట్‌వర్క్ హాస్పిటల్ ఈక్విటీలో 66.9 శాతం వాటా కలిగి ఉన్న స్వీడన్ కేంద్రంగా పనిచేసే మెడికవర్ కూడా ఈ చర్చలను ధ్రువీకరించింది.
అయితే కేకేఆర్ ఎంత మొత్తానికి ఈ వాటా కొనేందుకు ముందుకు వచ్చిందీ మెడికవర్ వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం 66.9 శాతం వాటా కోసం కేకేఆర్ 105 కోట్ల డాలర్ల (సుమారు రూ.9,900 కోట్లు) వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే ?
ఇటీవల అనేక విదేశీ పీఈ సంస్థలు భారత కార్పొరేట్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నాయి. పెరుగుతున్న జనా భా, ఆరోగ్య బీమా కవరేజీ ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేకేఆర్ ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్టార్ హాస్పిటల్‌లో, మరో పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్.. ‘కేర్’ హాస్పిటల్ ఈక్విటీలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేశాయి. చర్చలు ఫలిస్తే మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం ప్రస్తుతం స్వీడిష్ సంస్థ నుంచి అమెరికా పీఈ సంస్థ కేకేఆర్ చేతిలోకి వెళ్లనుంది.
ఐపీఓ ప్రయత్నాలు చేస్తూనే..
వాటా విక్రయం కోసం కేకేఆర్‌తో చర్చలు జరుపుతూనే, మరోపక్క పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి మెడికవర్ హాస్పిటల్స్ సిద్ధమవుతోంది. కేకేఆర్‌తో చర్చలు తుది ఒప్పందానికి దారితీయకపోతే ఐపీఓ ద్వారా కొంత వాటాను విక్రయించాలని భావించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వాటా అమ్మకం చర్చలను మెడికవర్ గ్రూప్ ధ్రువీకరించినా, కేకేఆర్ ఇంత వరకు ధ్రువీకరించలేదు.
2011లో ప్రారంభం
డాక్టర్ అనిల్ కృష్ణ తదితరులు 2011లో మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ పేరుతో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రమోట్ చేశారు. స్వీడన్ కేంద్రంగా పనిచేసే మెడికవర్ గ్రూప్ 2017లో మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ ఈక్విటీలో 22 శాతం వాటా కొనుగోలు చేసింది. తర్వాత క్రమంగా తన వాటాను ప్రస్తుత 66.9 శాతానికి పెంచుకుంది. దీంతో 2019 ఆగస్టులో మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ పేరు.. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియాగా మారింది. ప్రస్తుతం మెడికవర్ దేశవ్యాప్తంగా దాదాపు 6,000 పడకలతో 26 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. ఇందులో 16 హాస్పిటల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కాగా మెడికవర్ గ్రూప్.. యూర్‌పలోని 18కి పైగా దేశాల్లో పలు హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..