మూడు పోలవరాలు కట్టేంత మొత్తాన్ని పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:50 PM
45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు నరసాపురం వచ్చానని.. అనేక పాలనా సంస్కరణలకు నాంది పలికామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 1: 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు నరసాపురం వచ్చానని..అనేక పాలనా సంస్కరణలకు నాంది పలికామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మొగల్తూరులో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ.. తనకు మొగల్తూరు కొత్తేమీ కాదన్నారు. ప్రజా కార్యక్రమాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం జరిగిందని విమర్శించారు. అటువంటి పరిస్థితి నుంచి 94 శాతం సీట్లలో, 54 శాతం ఓట్లతో కూటమిని ప్రజలు గెలిపించారని అన్నారు.
మగవారితో సమానంగా ఆడవారు ఎదిగారు..
మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి డ్వాక్రా సంఘాలను స్థాపించామని సీఎం తెలిపారు. తన తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ప్రస్తుతం మగవారితో సమానంగా ఆడవారు ఎదిగారని అన్నారు. భవిష్యత్తులో మగవారిని మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తూ ఆదుకుంటున్నామన్నారు. దేశంలో నాలుగు వేలు, ఆరువేలు, పదివేలు, పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ఇప్పటి వరకూ 75 వేల 503 కోట్ల రూపాయలను పెన్షన్లు ఇచ్చామని.. ఆ డబ్బుతో మూడు పోలవరం ప్రాజెక్ట్‌లు కట్టవచ్చన్నారు. ఆర్థిక అసమానతలు పోవాలని.. అందరికీ సంక్షేమం అందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
నా ఆశయాన్ని ఆపలేరు..
కొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని.. వాటిని మహిళలు నడపాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూస్తామని చెప్పారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఇవ్వడాన్ని తానే ప్రారంభించానని తెలిపారు. ఎలాంటి మంచి పనులు చేసినా అడ్డుపడుతున్నారని ప్రతిపక్షంపై మండిపడ్డారు. ఏజెన్సీలోని పిల్లలకు మెరుగైన విద్య అందిస్తే, ప్రపంచంలోనే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. వాటన్నింటికీ గొడ్డలి పార్టీ అడ్డుపడుతోందని విమర్శించారు. ‘ఎంత అడ్డుపడినా నా ఆశయాన్ని ఆపలేరు’ అని స్పష్టం చేశారు.
ఆ రోజులు రాబోతున్నాయ్..
డీఎస్సీని అడ్డుకోవడానికి 350 పిటిషన్లు వేశారని.. పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తే, కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నట్లు వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో టీచర్లుగా ఎంపీకైన వారు గొడ్డలి పార్టీని హెచ్చరించినా వారిలో మార్పులేదన్నారు. త్వరలో ఏసీ బస్సులు వస్తున్నాయని.. మహిళలు ఉచితంగా ఆ బస్సుల్లో ఎక్కే రోజులు రాబోతున్నాయని తెలిపారు. మహిళలు ఇంటిపైన సోలార్ పెట్టుకుంటే విద్యుత్ తయారు అవుతుందని.. దానివలన కొన్ని రోజుల్లో ఉచితంగా కరెంటు పొందవచ్చని సూచించారు. వేసవికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి.. ఏసీలు పెట్టుకోవచ్చని.. అదనంగా ఉండే విద్యుత్‌ను అమ్ముకోవచ్చన్నారు. ప్రతి ఇంట్లో ఒక చిన్న పారిశ్రామికవేత్త రావాలని వన్ హౌస్- వన్ ఆంత్రప్రెన్యూర్ అనే పథకాన్ని తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
చరిత్రను మార్చబోతున్నాం...
అందరూ ప్రయత్నం చేస్తే మార్పు ఖచ్చితంగా వస్తుందని.. అనుకుంటే సాధించగలుగుతారని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 5 లక్షల 90 వేలు ఇళ్లు పూర్తి చేశామని.. మరో అయిదు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. అప్పట్లో పరిశ్రమలను పారద్రోలారని.. కూటమి అధికారంలోకి వచ్చాక 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రేపు(బుధవారం) గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్లబోతున్నామని.. చరిత్రను మార్చబోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానం చేస్తామని వెల్లడించారు.
డిప్యూటీ సీఎం ఆలోచన ప్రజల గురించే..
మూడేళ్లుగా కరెంటు ఛార్జీలు పెంచలేదని, తగ్గించామని సీఎం అన్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు 32 వేల కోట్ల రూపాయల మేర ఛార్జీలు పెంచారని చెప్పారు. లక్షా 50 వేల కోట్లు విద్యుత్ నిమిత్తం అప్పులు చేశారని వివరించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్న యుగపురుషుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. యూనిట్ రూపాయిన్నరకే ఆక్వాకు కరెంటు ఇస్తూ.. రూ.1200 కోట్లు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. కేరళంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనునిత్యం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు.
గొడ్డలి పార్టీకి వణుకు...
గొడ్డలి పార్టీకి వణుకు పుట్టిందని.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అయితే ఊరుకోమని అంటున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఏకగ్రీవం చేస్తే వారేం చేస్తారని ప్రశ్నించారు. ఆయారాం, గయారాంలకు చెక్ పెట్టేందుకే మున్నిపల్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలను తీసుకువచ్చామన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకువస్తే, మళ్లీ గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లిందని.. చిత్తుచిత్తుగా ఓడిపోతామనే భయంతో సర్ పేరుతో మళ్లీ కోర్టుకు వెళ్లారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే చాలదని.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండాలని అన్నారు. సమాజంలో కలుషితం పోవాలని తెలిపారు. జనవరి నుంచి సంజీవని పథకాన్ని తీసుకొస్తున్నామని.. అప్పుడు డాక్టర్లే ప్రజల దగ్గరకు వస్తారన్నారు.
సర్వస్వం ఫోనే..
‘రాబోయే రోజుల్లో మీ ఫోనే మీకు సర్వస్వం. ఏ పని చేయాలన్నా ఫోన్ ద్వారా చేయవచ్చు. మీ అందరూ ఆనందంగా ఉండడానికి ఏమైనా చేస్తాను. దానిని మీరు కూడా ఉపయోగించుకోవాలి. గొడ్డలి పార్టీ కులాలు, మతాల పేరుతో రెచ్చుగొడుతోంది. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలులో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు.. వైద్య రంగంలో కీలక ముందడుగు: టీజీ భరత్
పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల
Read Latest AP News And Telugu News