నవోదయలతో పాటు రెండు ఎయిమ్స్‌లు.. నిర్మలా సీతారామన్‌కు ఎంపీ రమేశ్ వినతి
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:05 AM
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
2024 డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ.2,359.82 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 28 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ఎంపీ గుర్తుచేశారు. అదే ప్రాతిపదికన ఏపీలో మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1,096 కోట్ల మేర నిధుల అవసరం ఉంటుందని తెలిపారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. 2014లో పునర్వ్యవస్థీకరించిన రాష్ట్రంలో జాతీయ స్థాయి విద్యా, వైద్య సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారని, దాని ఫలితంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటైందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తద్వారా అత్యున్నత వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం, వైద్య విద్య, పరిశోధన రంగాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి ముందుగా సాధ్యాసాధ్యాల అధ్యయనం, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం ప్రారంభ బడ్జెట్ కేటాయింపులు చేయాలని, అనంతరం సంస్థ ఏర్పాటుకు అవసరమైన మూలధన నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. ఈ ప్రతిపాదనలు జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలు, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, వికసిత్ భారత్ @2047 లక్ష్యాలకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన బడ్జెట్ సహాయాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఎంపీ లింగమనేని రమేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ
కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. పరారైన నిందితుడిని పట్టుకునే క్రమంలో ఫైరింగ్
Read Latest AP News And Telugu News