పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:31 PM
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి రేపు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల కానున్నాయి. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 1: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి రేపు(మంగళవారం) ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల కానున్నాయి. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. పాయకరావుపేట పేట వద్ద రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జల హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. నాలుగు జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తంగా 2,87,320 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణానికి ఇప్పటి వరకు మొత్తంగా రూ.4,192 కోట్లు ఖర్చు చేశారు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటుకుంటూ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి.
తూర్పు కనుమల్ని తొలిచి, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణ పనులను జరిగాయి. పోలవరం ఎడమ కాల్వ నిర్మాణంలో భాగంగా వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు.. అక్విడెక్టుల నిర్మాణం జరిగింది. కొన్ని చోట్ల నదీ ప్రవాహానికి ఎగువన.. ఇంకొన్ని చోట్ల ప్రవాహానికి దిగువ నుంచి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను నిర్మించారు. ఏలేరు నది బెడ్ లెవల్‌కు దిగువన గోదావరి జలాలను తరలించేందుకు సైఫన్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. పంపా నది ఎగువ నుంచి అక్విడక్ట్ నిర్మించి పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలకు మార్గాన్ని ఇంజినీర్లు సుగమం చేశారు. పంపా నదిపై 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదుల వేసి అక్విడెక్ట్‌ను నిర్మించారు.
10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అక్విడెక్ట్‌ను నిర్మించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి మొత్తంగా 472 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ప్రస్తుతం ఎడమ కాల్వ ద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలతో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది. పాయకరావుపేట అక్విడెక్ట్ నుంచి సీఎం విడుదల చేయనున్న జలాలు అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా కార్యాచరణను రూపొందించారు. పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ఏలేరు ఆయకట్టు కింద 80,700 ఎకరాలను స్థిరీకరించేలా సాగు నీటి సదుపాయాన్ని కల్పించనున్నారు.
పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ పరిధిలో 46,620 ఎకరాలను స్థిరీకరించారు. మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలతో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు భరోసానిచ్చేలా పోలవరం ఎడమ కాల్వ నిర్మాణం జరిగింది. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పోలవరం ఎడమ కాల్వ నిర్మించారు. పోలవరం ఎడమ కాల్వను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేసేలా కూటమి ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించి అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి నీరు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. పోలవరం ఎడమ కాల్వ-ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
నవోదయలతో పాటు రెండు ఎయిమ్స్‌లు.. నిర్మలా సీతారామన్‌కు ఎంపీ రమేశ్ వినతి
కర్నూలులో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు.. వైద్య రంగంలో కీలక ముందడుగు: టీజీ భరత్
Read Latest AP News And Telugu News