కర్నూలులో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు.. వైద్య రంగంలో కీలక ముందడుగు: టీజీ భరత్
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:53 AM
కర్నూలు జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు.
కర్నూలు, సెప్టెంబర్ 1: జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. 67 ఏళ్ల అశోక్‌కు లివర్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, అలాగే 26 ఏళ్ల షేక్ జబీ ఉల్లాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారని అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య బృందం సమన్వయంతో శస్త్రచికిత్సలు పూర్తైనట్లు వెల్లడించారు.
దాదాపు 20 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు కర్నూలులో జరగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కర్నూలులో ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం వైద్య రంగంలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. రాయలసీమలో ఇలాంటి అత్యాధునిక, క్లిష్టమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు.
ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా ఉన్నారని... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని టీజీ భరత్ అన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, నిపుణులైన వైద్య బృందం కృషి అభినందనీయమన్నారు. గౌరిగోపాల్ హాస్పిటల్, టీఎక్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అవయవాలు దానం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. అవయవ దానం ద్వారా మరికొందరికి కొత్త జీవితాన్ని అందించడం గొప్ప మానవతా సేవగా చెప్పుకొచ్చారు. కర్నూలులోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా మంత్రి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కర్నూలు వైద్య రంగంలో ఈ విజయం కొత్త నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తుందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. పరారైన నిందితుడిని పట్టుకునే క్రమంలో ఫైరింగ్
నవోదయలతో పాటు రెండు ఎయిమ్స్‌లు.. నిర్మలా సీతారామన్‌కు ఎంపీ రమేశ్ వినతి
Read Latest AP News And Telugu News