Share News

'Thunderstorm' on laborers కూలీలపై ‘పిడుగు’

ABN , Publish Date - May 06 , 2026 | 12:20 AM

'Thunderstorm' on laborers ఆ ముగ్గురు మహిళలు అంతవరకు దొండ పంట సాగులో గడ్డితీత పనులు చేశారు. చిరు జల్లులు పడుతుండడంతో పని ఆపి ఇంటికి బయలుదేరారు.

'Thunderstorm' on laborers కూలీలపై ‘పిడుగు’
సత్తెమ్మ , అప్పలనరశమ్మ , రాము

కూలీలపై ‘పిడుగు’

చెట్టుకు సమీపంలో పడి ముగ్గురు మహిళల మృతి

వారిలో ఇద్దరు తోటికోడళ్లు

బాధితులంతా కూలీలే..

గెడ్డవలసలో ఘటన

ఆ ముగ్గురు మహిళలు అంతవరకు దొండ పంట సాగులో గడ్డితీత పనులు చేశారు. చిరు జల్లులు పడుతుండడంతో పని ఆపి ఇంటికి బయలుదేరారు. అంతలో చెట్టు కింద ఉంచిన ఖాళీ క్యారేజీలు గుర్తుకు వచ్చి తీసుకురావడానికి వెళ్లారు. పాపం అదే సమయంలో వాన మొదలు కావడం.. కొద్ది క్షణాల్లోనే చెట్టు సమీపంలో పిడుగు పడడం.. ఆ దాటికి ముగ్గురూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయింది. రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మజ్జి సత్తెమ్మ (55), ఈమె తోటికోడలు మజ్జి అప్పలనర్సమ్మ (50), పైల రాము (45)ల విషాదాంతమిది.

రాజాం రూరల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి):

రెక్కాడితే గాని డొక్కాడని కూలి బతుకులు.. ఏరోజు కూలీతో ఆ రోజు బతకాల్సిన బడుగుజీవులు.. పొలం పనులకు వెళ్తేతప్ప పూటగడవని పరిస్థితి ఆ ముగ్గురిది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం గెడ్డవలస గ్రామానికి చెందిన మజ్జి సత్తెమ్మ (55). ఆమె తోటికోడలు మజ్జి అప్పలనర్సమ్మ (50), పైల రాము (45) అదే గ్రామానికి చెందిన ముదిలి రామకృష్ణకు చెందిన పొలంలో పనులకు వెళ్లారు. దొండసాగులో గడ్డితీత పనుల్లో నిమగ్నమయ్యారు. ఐదు గంటల సమయంలో చిరుజల్లులు ప్రారంభం కావడంతో పనులు చేస్తున్న ముగ్గురిని ఇంటికి వెళ్లిపొమ్మని రైతు రామకృష్ణ చెప్పాడు. దీంతో ఆ ముగ్గురూ ఇంటిబాట పట్టే క్రమంలో మధ్యాహ్నం భోజనం చేసిన క్యారేజీలు తీసుకునేందుకు సమీపంలోని చెట్టుకిందకు వెళ్లారు. అక్కడికి వెళ్లేసరకి చిరుజల్లులు కాస్త వర్షంగా మారడంతో అక్కడే కాసేపు ఉండిపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో పిడుగు పడడడంతో ఆ ముగ్గురూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతిచెందిన మజ్జి సత్తెమ్మ, మజ్జి అప్పలనరశమ్మ తోటికోడళ్లు. సత్తెమ్మ భర్త నరిశింహులు, అప్పలనరశమ్మ భర్త రాజు స్వయానా అన్నదమ్ములు. వీరిద్దరిలో నరిశింహులు కూలీ కాగా రాజు గతంలో మృతి చెందాడు. కాగా పైల రాము భర్త తిరుపతిరావు కూడా కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు.

భార్యాభర్తలు క్షేమం..

మృతి చెందిన ముగ్గురితో పాటు పొలం పనుల్లో నిమగ్నమైన రైతు రామకృష్ణ, అతని భార్య జయమ్మ క్షేమంగా బయటపడ్డారు. వాస్తవానికి మధ్యాహ్నం అయిదుగురూ ఒకేచెట్టు కింద భోజనం చేసి కొంతసేపు సేదతీరారు. వారిద్దరి కేరేజీలు కూడా ఆ చెట్టుకిందనే ఉన్నాయి. అయితే వర్షం ప్రారంభం కావడంతో ముగ్గురు కూలీలను ఇంటికి వెళ్లిపొమ్మని భార్యాభర్తలిద్దరూ పొలంలోనే ఉండిపోయారు. అలా కాకుండా అయిదుగురూ కేరేజీల కోసం వెళ్లి ఉంటే మరో ఇద్దరు కూడా మృత్యువాత పడేవారని స్థానికులు చెబుతున్నారు.

తెర్లాంలో మరొకరు

తెర్లాం, మే 5 (ఆంధ్రజ్యోతి)! భార్యతో కలిసి ఉపాధి పనులకు వెళ్లిన ఆ వ్యక్తి సాయంత్రం పనిముగిసిన వెంటనే భార్యతో సహా ఇంటిబాట పట్టాడు. చెరువు లోపలి నుంచి బయటకు వస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే భర్త మృతి చెందాడు. సమీపంలో ఉన్న మరొకరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలోని చెన్నై చెరువువద్ద మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.

తెర్లాంకు చెందిన జమ్మల సూర్యనారాయణ (60) మంగళవారం ఉదయం భార్య సత్యవతితో కలిసి గ్రామంలోని చెరువుపనికి వెళ్లాడు. సాయంత్రం పని ముగిసాక సత్యవతితో పాటు కూలీలంతా ఇంటిబాట పట్టారు. చెరువులోపలి నుంచి గట్టు ఎక్కుతుండగా వారిద్దరి సమీపంలో పిడుగు పడడంతో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. గణపతి స్వల్ప గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇదే మండలం అంట్లవార గ్రామంలో సోపేటి పకీరుకు చెందిన ఆవు సైతం పిడుగు పడి మృతి చెందింది.

Updated Date - May 06 , 2026 | 12:20 AM