‘అక్కా.. నన్ను చంపేస్తార’ని చెప్పిన మరుసటి రోజే యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:04 PM
విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద ఓ మత్స్యకారుడు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులకు హత్య జరగడానికి ముందు రోజే చెప్పినట్లు తెలుస్తోంది..
విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి): ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద ఓ మత్స్యకారుడు దారుణ హత్యకు గురైయ్యారు. అయితే, తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులకు హత్య జరగడానికి ముందు రోజే చెప్పినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలోని మక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి కుటుంబంతో కలిసి నగరంలోని పెయిందొరపేటలో నివాసముంటున్నారు. వృత్తిరీత్యా మత్స్యకారుడైన చంటికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో చంటి తన కుటుంబాన్ని వదిలిపెట్టి అక్క మెరుగు అప్పలకొండ ఇంట్లో ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో చంటి అక్క అప్పలకొండతో తన బాధను పంచుకున్నారు. తనను ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పి బాధపడ్డారు. భోజనం అనంతరం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన చంటి రాత్రి ఇంటికి రాలేదు. దీంతో భయపడిన అక్క అప్పలకొండ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
కానీ, అంతలోపే చంటి దారుణ హత్యకు గురయ్యారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద శవంగా కనిపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి తలకు బలమైన గాయాలున్నట్లు, మెడకు నైలాన్‌తాడుతో బిగించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య ఎవరు చేశారు? హత్యకు గల కారణాలేమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం
అమరావతిని మారుస్తామనడం అవివేకం
For More AP News And Telugu News