విశాఖలో తుపాను బీభత్సం.. పునరుద్ధరణ చర్యలు చేపట్టిన జీవీఎంసీ
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:48 PM
రాష్ట్రంలో ‘ఆర్నబ్’ తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో విశాఖపట్నం నగరంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబర్ 29: నగరంలో ‘ఆర్నబ్’ తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
తుపాను దాటికి నగరంలో 1,013 చెట్లు నేలకూలగా.. 904 చెట్లను పూర్తిగా తొలగించామని కమిషనర్ తెలిపారు. చెట్లు కూలడంతో 313 రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయని.. ఈ మేరకు చెట్లను తొలగించి.. రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వీధి దీపాల స్తంభాల్లో 70 శాతం పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు కమిషనర్ చెప్పారు. ప్రజల భద్రత దృష్ట్యా.. ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న 892 బలహీన ఫ్లెక్సీలను జీవీఎంసీ సిబ్బంది పూర్తిగా తొలగించినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం నాటికి నగరంలో తాగునీటి సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామన్నారు. మిగిలిన పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. సాధారణ పరిస్థితులను తీసుకురావడమే తమ ధ్యేయమని కమిషనర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆర్నబ్ తుఫాన్ వేళ నిద్రాహారాలు మాని పనిచేశారు.. మంత్రి లోకేశ్ ప్రశంసలు
ఆర్నబ్ తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష.. త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
Read Latest AP News And Telugu News