వైసీసీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. స్టీల్ ప్లాంట్ అమ్మేసేవారు: పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:25 PM
రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే.. గంగవరం పోర్టులాగే స్టీల్ ప్లాంట్‌ను కూడా అమ్మేసేవారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా.. నమ్మే పరిస్థితిలో విశాఖపట్నం ప్రజలతోపాటు స్టీల్ ప్లాంట్ కార్మికులు లేరన్నారు.
విశాఖపట్నం, జూన్ 11: రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే.. గంగవరం పోర్టులాగే స్టీల్ ప్లాంట్‌ను కూడా అమ్మేసేవారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా.. నమ్మే పరిస్థితిలో విశాఖపట్నం ప్రజలతోపాటు స్టీల్ ప్లాంట్ కార్మికులు లేరన్నారు. వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవ లేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్యాకేజీ తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల టెంట్ వేసుకుని దీక్ష చేస్తే.. ఆ వైపు కనీసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కన్నెత్తి కూడా చూడలేదని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, చైర్మన్లతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. జిల్లాలోని హౌసింగ్ పట్టాలు, జీఓ నెంబర్ 30, 45 భూ సమస్యలపై కూలంకషంగా చర్చించామన్నారు. యూఎల్సీ, అన్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్, 22ఏ డిలీషన్ తదితర రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. నిబంధనల పరిధిలో ఉన్న భూములకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. భూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరామని గాజువాక ఎమ్మెల్యే పల్లా వివరించారు.
భూ ఆక్రమణలపై విజిలెన్స్ విభాగానికి పూర్తి బాధ్యతలు కట్టబెట్టామని.. కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సింహాచలం పంచ గ్రామాల భూ సమస్యలు, గాజువాక ఇనామ్ భూములపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంపై కమిటీ ఇప్పటికే ఏర్పాటయిందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు.
కార్మికుల అత్యున్నత భద్రత.. సంస్థ యాజమాన్యం బాధ్యత అని ఎమ్మెల్యే పల్లా స్పష్టం చేశారు. భయాందోళనల మధ్య కార్మికులు విధులకు వెళ్లడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పూర్తి భరోసా కల్పించాలని సంస్థ యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్లాంట్ భద్రతా ప్రమాణాలను రెగ్యులర్‌గా మానిటర్ చేసేందుకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పనిచేయని సీఎంకు ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకు?: హరీశ్ రావు
దశాబ్దంగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ లేదు: ఈడీ అడ్మిన్‌కు ఉద్యోగ జేఏసీ మెమోరాండం
For More AP News And Telugu News