విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఎంపీ శ్రీభరత్ నివాళులు
ABN , Publish Date - May 28 , 2026 | 10:28 AM
విశాఖపట్నంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీ శ్రీభరత్ అన్నారు.
విశాఖపట్నం, మే 28: జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన తరువాత మార్పు మొదలైందని తెలిపారు. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లు మహిళల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తీసుకువస్తే కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని మండిపడ్డారు. బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కలిపిస్తూ తీర్మానం చేశారని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్: గంటా శ్రీనివాసరావు
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని.. సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదును పొందారన్నారు. ఎన్టీఆర్ 1982లో టీడీపీ పార్టీని స్థాపించారని.. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి విజయం సాధించారని తెలిపారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ముందుకు వెళ్లారన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని తెలిపారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. కార్యకర్తల కోసం లోకేశ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు దిగ్విజయంగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. టీడీపీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేశారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
టీడీపీ అంటే ఒక చరిత్ర: పట్టాభి రామ్
తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే పట్టాభి రామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పాలనలో అనేక మార్పులను తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగిస్తామని చోడే పట్టాభి రామ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News