ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని నివాళులు..
ABN , Publish Date - May 28 , 2026 | 10:02 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నివాళులు అర్పించారు. విజయవాడలోని తన కార్యాలయంతో పాటు, పటమట ఎన్టీఆర్ సర్కిల్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు (గురువారం) తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన అభిమానులు పోటెత్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు అభిమానులు అంజలి ఘటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాజీ ముఖ్యమంత్రిని స్మరించుకున్నారు. విజయవాడలోని తన కార్యాలయంతో పాటు, పటమట ఎన్టీఆర్ సర్కిల్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 'దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు ప్రజలందరూ పండుగ జరుపుకునే రోజు. సినీ, రాజకీయ రంగాల్లో రికార్డులన్నీ ఎన్టీఆర్ సొంతం. 9 నెలల్లో రాజకీయ పార్టీ పెట్టి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనది. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు.. టీవీలు సరిగా లేవు. అయినా ప్రజల్లోకి టీడీపీని బలంగా తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రారంభించి పేదలను ఆదుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చక్రం తిప్పారు. ఆ మహనీయుడి ఆశయాలను పాటిస్తూ ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాం.
ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే బాటలో తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు. నేడు టీడీపీని జాతీయ రాజకీయాలకు దిక్సూచిగా తీర్చిదిద్దారు. 44 సంవత్సరాలుగా బడుగు, బలహీన వర్గాల సేవకు పార్టీ కృషి చేసింది. ఈ క్రమంలో అందరి సహకారంతో కోటి సభ్యత్వాలను సాధించింది. దేశంలోనే కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలిచింది. రాబోయే కాలంలో మా యువనేత నారా లోకేశ్ ఆధ్వర్యంలో నవతరం, పెద్దతరం కలిసి పని చేస్తారు. భవిష్యత్తులో 50 సంవత్సరాల పాటు బ్రహ్మాండమైన నాయకత్వాన్ని టీడీపీ చూడబోతోంది' అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
మరణంలేని మహా మనిషి ఎన్టీఆర్‌కు జోహార్లు: నారా లోకేశ్