ఏయూ అంటే పేరు కాదు.. వందేళ్ల చరిత్ర: మంత్రి లోకేశ్..
ABN , Publish Date - Apr 27 , 2026 | 07:52 PM
ఆంధ్ర యూనివర్సిటీ అంటే పేరు కాదని వందేళ్ల చరిత్రని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే తెలుగువారు పోరాడి తెచ్చుకున్న విశ్వవిద్యాలయం ఏయూ అని లోకేశ్ పేర్కొన్నారు.
విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీ అంటే పేరు కాదని వందేళ్ల చరిత్రని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే తెలుగువారు పోరాడి తెచ్చుకున్న విశ్వవిద్యాలయం ఏయూ అని లోకేశ్ పేర్కొన్నారు. ఏయూ అంటే ఒక ఎమోషన్ అని.. తానిక్కడ చదువుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తోందన్నారు. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి లోకేశ్ ప్రసంగించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి కేబినెట్ మీటింగ్ ఏయూలోనే ఏర్పాటు చేసినట్లు మంత్రి లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఏయూ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం, కష్టం ఉందని అన్నారు. ఈ యూనివర్సిటీలో చిహ్నం నుంచి కోర్సులు వరకు అన్ని ప్రత్యేకమే అని చెప్పుకొచ్చారు. ఏయూ అనేక ర్యాంకులు సాధించి.. దేశంలో టాప్-3 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉందన్నారు. అలాగే ప్రపంచంలో టాప్-100 యూనివర్సిటీల్లో నిలిచిందన్నారు. రాజకీయాల్లోనూ ఏయూ విద్యార్థులు రాణిస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలని 2013 సంవత్సరంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
రిస్క్ లేనిదే విజయం లేదని.. విజయానికి ఓటమి తొలి మెట్టు అని విద్యార్థులకు మంత్రి లోకేశ్ సూచించారు. కాలం మారుతుందని, సాంకేతికత మారుతుందని కరిక్యులం కూడా మారాలన్నారు. ఈ సందర్భంగా విద్య శాఖలో ఖాళీలను రానున్న ఏడాది కాలంలోనే భర్తీ చేస్తామంటూ మంత్రి లోకేశ్ తీపి కబురు చెప్పారు. మంగళవారం నాడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసుకుంటున్నామని పేర్కొన్నారు. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఏయూ వందేళ్ల వేడుకల సందర్భంగా స్మారక నాణెం, స్టాంప్, కాఫీ టేబుల్ బుక్‌ను ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సచిన్ టెండూల్కర్, కేంద్ర, రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థులు ఒత్తిడిని జయించాలి: సచిన్ టెండూల్కర్..
కృషి, పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమే: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..