విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Apr 27 , 2026 | 06:02 PM
విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆ సంస్థకు 20 ఎకరాల భూమి కేటాయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఏప్రిల్ 27: విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆ సంస్థకు 20 ఎకరాల భూమి కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థకు ఎకరం భూమి కేవలం రూ.0.99 చొప్పున కేటాయించింది. ఎండాడ హిల్‌లో ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఈ స్థలం కేటాయించినట్లు వివరించింది. వైజాగ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ చర్యల్లో భాగంగా ఈ భూమి కేటాయింపు జరిపినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
విశాఖపట్నంలో రూ.750 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. దాదాపు 7 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌కు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2029, జనవరి నాటికి ఈ ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ ఆరేళ్లలో పూర్తి చేయాలంది. అవసరమైతే రెండేళ్లు పొడిగింపునకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ గ్రీన్ క్యాంపస్ కోసం 100 శాతం గ్రీన్ పవర్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది. రహదారులు, నీరు, విద్యుత్ సహా పూర్తి మౌలిక వసతులు కల్పిస్తామని ఈ సంస్థకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏపీఐఐసీ (APIIC) ద్వారా రూ.79 కోట్లతో ఇన్‌ఫ్రా అభివృద్ధికి ఆమోదం తెలిపింది. 10,000 సీటర్ల క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్‌కు ప్రభుత్వం సూచించింది. ఇన్ఫోసిస్ ఏర్పాటుతో వైజాగ్ అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు పడినట్లు అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి: సీఎం చంద్రబాబు
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..
For More AP News And Telugu News