Share News

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:20 PM

అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నం.1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 22: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని.. ఇండస్ట్రియల్‌ ఏరియా అని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నం.1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లికి నీళ్లు తెచ్చే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. త్వరలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని.. జిల్లాలో ప్రతి చెరువు, రిజర్వాయర్లను నింపుతామని వెల్లడించారు. సెప్టెంబర్‌ తొలి వారంలోనే అనకాపల్లికి నీళ్లు తెచ్చి చూపిస్తామని పేర్కొన్నారు. ‘మేం చేస్తున్న పనులను అభినందిస్తే అదే పెద్ద కిక్‌’ అని చెప్పుకొచ్చారు.


మంచిపనులు చేస్తుంటే కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. విమర్శలు చేసేవారికి డేటా సెంటర్‌ అంటే తెలియదని విమర్శించారు. ఇప్పటి వరకు డేటా సెంటర్‌ ప్రారంభం కాలేదని, తాగడానికి నీళ్లు లేవంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్‌ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. డేటా సెంటర్లతో ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. దేశంలో తొలిసారి క్వాంటం కంప్యూటర్‌ అమరావతికి వస్తోందన్నారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే Ai టెక్నాలజీ నేర్పాలని సూచించారు. Ai నేర్చుకుంటే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని జయించవచ్చారు.


అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదని.. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమే అని చంద్రబాబు అన్నారు. చెత్త నుంచి కంపోస్ట్‌, కరెంట్‌, గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్‌ పంచాయతీగా తయారుకావాలని సూచించారు. ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో మూడు గ్యాస్‌ సిలిండర్ల డబ్బులను 4 నెలలకోసారి జమ చేస్తామన్నారు. ఇండక్షన్‌ స్టవ్‌లు పెట్టుకుంటే గ్యాస్‌తో కూడా అంత పని ఉండదని అన్నారు.


గొడ్డలి పార్టీ అరాచకాన్ని నమ్ముకుందని.. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారన్నారు. చాలాచోట్ల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. వైసీపీ తప్పులను సరిదిద్దడానికి మూడేళ్లు పట్టిందన్నారు. విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. DSCలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలు నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసేవాళ్లు భయపడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 01:34 PM