Share News

వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ

ABN , Publish Date - Aug 22 , 2026 | 10:05 AM

వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు.

వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ
Veligonda Project

అమరావతి, ఆగస్టు 22: వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు. దీంతో ఇప్పటి వరకూ రూ.768 కోట్లను నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు చెల్లించింది. మూడో విడతగా ఈరోజు(శనివారం) 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇప్పటి వరకూ మొత్తం 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. దీంతో దాదాపు 85 శాతం మేర ఆర్ అండ్ ఆర్ పూర్తి అయ్యింది.


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈనెల 31 తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని చెప్పారు. అసాధ్యమనుకున్న 30 ఏళ్ల వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యమని చేసి చూపించామన్నారు. 1996లో శిలాఫలకం వేసి 2026లో ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, తాగునీరు ఇవ్వాలని కోరారని.. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించేలా రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేశామన్నారు. నాడు ఎన్టీఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించటం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా 50 శాతం లోటు వర్షపాతం ఉందని... శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు రాలేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే పూర్తి చేసేవాళ్లమని... అయినా గత పాలకులు చేసిన డ్రామాలతో ప్రాజెక్టు సాధ్యం కాలేదని విమర్శించారు.


పోలవరం పూర్తి చేసి కృష్ణాడెల్టాకు, శ్రీశైలంలో నీరు పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వొచ్చని సీఎం అన్నారు. గంగా-గోదావరి- కావేరి నదులను అనుసంధానించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ఐదు నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాల్లో సమస్యలు తీరిపోతాయని వెల్లడించారు. దేశానికే నీటి సమస్య పరిష్కారమై నీటి భద్రత వస్తుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు జరిగేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయి నీరు ప్రతి ఇంటికీ ఇస్తామని.. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సెప్టెంబరులో హార్టికల్చర్ హబ్‌కు ఫౌండేషన్ వేస్తామని చెప్పారు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థను నష్టం చేశారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధితోపాటు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాల్సి ఉందని... మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ప్రజలను సీఎం చంద్రబాబు కోరారు.


ఇవి కూడా చదవండి...

ప్రియాంక కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల పని.. జగన్‌పై వర్ల రామయ్య ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 11:04 AM