ప్రియాంక కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:55 AM
డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతితో సురవరపు దిశ్వంత్, దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను 19న ఉదయం 11 గంటలకు..
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు
రాజమహేంద్రవరం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతితో సురవరపు దిశ్వంత్, దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను 19న ఉదయం 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పోలీసులు తీసుకెళ్లారు. దర్యాప్తు అధికారి, అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీశ్ వారిని విచారించారు. 20న సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. 21న ఉదయం 11 గంటల వరకూ మాత్రమే కోర్టు అనుమతి ఉండటంతో నిందితులను జైలుకు తరలించారు. ఇప్పటికే దర్యాప్తు అధికారి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. నిందితులను మరొకసారి కస్టడీకి తీసుకొనే అవకాశం ఉంది. ఈ ఘటనపై ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ స్టేషన్ సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తుంది. అయితే ఆరోపణల నేపథ్యంలో ఆ డీఎస్పీని పక్కనబెట్టి డీఎస్పీ శివప్రియను ఐవోకు సహాయ అధికారిగా నియమించారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన తర్వాత కేవలం మూడు గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ వేశామని.. వేగంగా స్పందించామని పోలీసులు చెబుతున్నారు. అయితే అప్పటికప్పుడు అర్ధరాత్రి వేళ హడావుడిగా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయడం వెనుక నిందితులను ఉద్దేశపూర్వకంగా రక్షించే గూడుపుఠాణి ఉందనే చర్చ నడుస్తోంది. ఘటన 10 గంటల ప్రాంతంలో పోలీసుల దృష్టికి వెళ్లగా అర్ధరాత్రి 1 గంట సమయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.