Share News

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:50 AM

అన్నయ్య చిరంజీవి గురించి తలచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’..  చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్
Pawan Kalyan birthday wishes

అమరావతి, ఆగస్టు 22: అన్నయ్య చిరంజీవి గురించి తలచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నప్పుడు, కొన్ని మధురమైన సంఘటనలు గుర్తొచ్చాయన్నారు. కాలేజీ విద్యార్థిగానే ఉన్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనిపించేదని చెప్పుకొచ్చారు. అన్నయ్య తన పొడవైన ఉంగరాల జుట్టు, దృఢమైన NCC క్యాడెట్ శరీరాకృతి, బెల్-బాటమ్ ప్యాంట్, కళ్లద్దాలు పెట్టుకుని నాన్న బుల్లెట్(350 CC) బైక్ నడుపుతుంటే... అబ్బా! ఆ దృశ్యం ఒక అభిమానిగా ఆయనను ఆరాధించేలా చేసే అద్భుతమైన క్షణమని చెప్పుకొచ్చారు.


‘సినిమా హీరో కాకముందే. మా అన్నయ్య నాకు ఎప్పుడూ హీరోలా ఉండేవారు. ఆయనకు పెళ్లయినప్పుడు, మా అందరికీ దూరమైపోతారేమోనని నేను ఆందోళన చెందాను. నా కన్నీళ్లకు కారణం తెలుసుకుని అన్నావదినలు నవ్వుకున్నారు. ఆ తర్వాత నన్ను చెన్నై తీసుకెళ్లి వాళ్ల దగ్గరే ఉంచుకున్నారు. వారు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలను వర్ణించడానికి మాటలు చాలవు. షూటింగ్‌ల సమయంలో ఆయన పడిన కష్టం, కృషి, గాయాలను నేను దగ్గరుండి చూశాను. చెన్నైలో ఉక్కపోత, తేమ వాతావరణంలో 18 గంటల పాటు కఠినమైన పనిచేసి, చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవారు. కానీ నా చదువులో వైఫల్యాల గురించి, జీవితంలో దిశానిర్దేశం లేకపోవడం గురించి ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదు. తన ఉదారతతో మా కుటుంబాన్ని, బంధువులను ఎంతగానో సంతోషపెట్టారు. అదే స్ఫూర్తిని తన స్నేహితులకు, నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు, ప్రతి ఒక్కరికీ పంచారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేసిన ప్రధాన, కీలక వ్యక్తులలో చిరు ఒకరు’ అని పవన్ అన్నారు.


‘చిరంజీవి ఎల్లప్పుడూ భారతీయ సినిమాను విశ్వసిస్తుంటారు. ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గూండా రాజ్’ హిందీలో రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించారు. సూపర్‌స్టార్‌ నుంచి మెగాస్టార్‌డమ్‌కు ఎదిగి.. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి సహా జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు(పద్మవిభూషణ్) అందుకున్నారు. ఇటీవల వెన్నెముకకు ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా తిరిగి పుంజుకుని పనిలోకి వెళ్లారు. నగరం నిద్రపోనట్లే, విశ్రమించని వ్యక్తి చిరంజీవి. అందుకే ఆయన మా ప్రియమైన ‘మెగాస్టార్’.. ‘నా ఏకైక హీరో’. అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కేవలం లాంఛనమే కాదు.. ఎంతో మందికి ఒక సున్నితమైన జ్ఞాపిక’ అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల పని.. జగన్‌పై వర్ల రామయ్య ఫైర్

వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 12:14 PM