ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. విశాఖ సీఐఐ సదస్సులో చంద్రబాబు ప్రకటన
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:08 PM
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖను గుర్తిస్తూ కేంద్రం ప్రకటించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజన థింసా లాంటి నృత్యంతో పాటు ఏపీ సంస్కృతీ సంప్రదాయాలతో అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం ఇది అని చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం, నవంబర్ 12: విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ఈ సదస్సుతో కలిపి ఏపీ మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిందని వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పారిశ్రామిక ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధులు, విదేశీ రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖను గుర్తిస్తూ కేంద్రం ప్రకటించిందని అన్నారు. గిరిజన థింసా లాంటి నృత్యంతో పాటు ఏపీ సంస్కృతీ సంప్రదాయాలతో అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రాంతం ఇది అని చెప్పుకొచ్చారు.
రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సోలార్ వేఫర్స్, సౌర ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ లాంటి అంశాల్లో ఏపీ పనిచేస్తోందని సీఎం తెలిపారు. క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో అత్మనిర్భరతా, అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు కోసం స్పేస్ విజన్, సెమికండక్టర్ మిషన్, లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం,గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ మిషన్స్‌ను ప్రాధాన్య రంగాలుగా గుర్తించామని వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుతో పాటు క్వాంటం పరికరాలను మేడ్ ఇన్ అమరావతి ముద్రతో తయారు చేస్తామని చెప్పారు.
పౌర అవసరాలు, డిఫెన్స్ అప్లికేషన్ల కోసం డ్రోన్లను తయారు చేసేందుకు డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను రవాణా చేస్తున్నట్లు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా ప్రపంచానికి హార్టీకల్చర్ హబ్‌గా ఏపీని మారుస్తామని తెలిపారు. 12 ఎక్స్ స్పీడ్ ఆఫ్ అప్రూవల్స్‌తో వేగంగా అనుమతులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలో అనుసరించే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా కార్ల యూనిట్ ఓ మంచి ఉదాహరణగా సీఎం చెప్పుకొచ్చారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కూడా కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించామన్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా కేవలం 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీగా ఉందని వెల్లడించారు. ఇదీ అనుమతులను వేగంగా మంజూరు చేయడంలో ఏపీ ట్రాక్ రికార్డ్ అని అన్నారు. బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. పూర్తి టెక్నాలజీ సాయంతో ఐకానిక్ భవనాలతో నగరాన్ని నిర్మాణం చేపడుతున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా మార్చుకోవాలని కోరారు.
ఏపీలో ఉన్న 6 ఆపరేషనల్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, హై స్పీడ్ రైలు నెట్వర్క్, రోడ్డు కనెక్టివిటీతో అత్యుత్తమ లాజిస్టిక్స్ ప్రాంతంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. రివర్ లింకింగ్ ద్వారా సాగు, తాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. గోదావరి కుడి, ఎడమ కాలువల ద్వారా విశాఖకు, అమరావతికి నీరు ఇవ్వడంతో పాటు, పొరుగు రాష్ట్రంలో ఉన్న కావేరీ నదికి నీరు తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు. గోదావరి కావేరీ లింక్ ద్వారా 5 రాష్ట్రాల దాహార్తి తీర్చే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ గ్రిడ్ లాగే వాటర్ గ్రిడ్ కూడా ఉంటే ప్రజలకు లబ్ధి కలుగుతుందని అన్నారు. ఏపీలో 25 సెక్టోరల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని... తిరుపతిని గ్లోబల్ సెమీకండక్టర్ చిప్ డిజైన్ క్యాపిటల్‌గా తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ జన్ విశ్వాస్ అని పిలుపు ఇచ్చారన్నారు.
ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా అనుమతులు రియల్ టైమ్‌లో ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా అందిచాలని నిర్ణయం తీసుకున్నామని.. నేటి నుంచే ఎస్క్రో ఖాతా పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఏపీ నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ చట్టాన్ని దేశం కూడా ఆచరించే పరిస్థితి వస్తుందని అన్నారు. రాజకీయ వైరుధ్యాలకు పెట్టుబడిదారులు బలి కాకూడదనే ఈ చట్టం తీసుకువస్తున్నామని వివరించారు. యాక్సెస్ టూ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. సామాజిక, ఆర్థిక భద్రతలో కీలక స్థానం దక్కిందని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నెమ్మదిగా అడుగులు వేస్తున్న రాప్తాడు బాలిక: మంత్రి సత్యకుమార్
విశాఖ సీఐఐ సదస్సులో పెట్టుబడుల ప్రకటనలు.. ఏపీపై పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు
Read Latest AP News And Telugu News