Share News

విశాఖ సీఐఐ సదస్సులో పెట్టుబడుల ప్రకటనలు.. ఏపీపై పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:41 PM

విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 అట్టహాసంగా మొదలైంది. ‘నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్’ థీమ్‌తో ప్రారంభమైన ఈ సదస్సులో వివిధ సంస్థల ఛైర్మన్‌లు ప్రసంగించారు.

విశాఖ సీఐఐ సదస్సులో పెట్టుబడుల ప్రకటనలు.. ఏపీపై పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు
CII Partnership Summit 2026

విశాఖపట్నం, నవంబర్ 12: విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 అట్టహాసంగా మొదలైంది. ‘నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్’ థీమ్‌తో ప్రారంభమైన ఈ సదస్సులో వివిధ సంస్థల ఛైర్మన్‌లు ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై జీఎంఆర్, కియా, సాగర్ డిఫెన్స్ సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. జీఎమ్ఆర్ సంస్థ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం ఏపీకి ఓ ఎకనామిక్ ఇంజిన్‌గా మారుతోందని స్పష్టం చేశారు. గతంలో శంషాబాద్ విమానాశ్రయం గురించి ఆలోచన చేసి నిర్మించబట్టే ఇప్పుడు కీలక మౌలిక వనరుగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా శంషాబాద్ నిలుస్తోందని వెల్లడించారు. ‘పెట్టుబడి దారుగా చెబుతున్నా.. ఏపీలో ఈజ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు, ఏరోసిటీని జీఎంఆర్ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది’ అని జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు పేర్కొన్నారు.


ఏపీపై ఉన్న భరోసాతోనే పెట్టుబడులు: గ్యాంగ్ లీ

ప్రభుత్వం- ప్రైవేటు భాగస్వామ్యం విజయమైందని అనటానికి కియా ఒప్పందమే ఓ ప్రత్యక్ష ఉదారహణ అని కియా ఇండియా ఎండీ అండ్ సీఈఓ గ్వాంగ్ లీ అన్నారు. ఏటా 4 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తూ ఏపీ ఆటోమొబైల్ ఎకో సిస్టమ్‌కు కియా తోడ్పడుతోందని తెలిపారు. 100కు పైగా దేశాలకు ఏపీలో తయారవుతున్న కార్లను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రపంచానికి అందించేలా కియా పనిచేస్తోందన్నారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిలిటీలో భాగంగా సుస్థిర ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామన్నారు. రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో ప్రస్తుత ప్లాంట్‌ను విస్తరించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించామని చెప్పారు. దీని ద్వారా నేరుగా 12 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఏపీపై ఉన్న పూర్తి భరోసాతోనే ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని గ్వాంగ్ లీ వెల్లడించారు.


అందుకే ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాం: సాగర్ డిఫెన్స్ సీఈవో

‘మహారాష్ట్ర నా జన్మభూమి అయితే ఆంధ్రప్రదేశ్ నా భాగ్య భూమి’ అని సాగర్ డిఫెన్స్ సీఈఓ నికుంజ్ పరాశర్ అన్నారు. రక్షణ రంగంలో సాగర్ డిఫెన్స్ సంస్థ స్థానిక యువతను భాగస్వాములను చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ఐదో పారిశ్రామిక విప్లవం వస్తుందని ఏపీ సీఎం తరచూ చెబుతుంటారని.. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందన్నారు. అందుకే ఏపీలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చామని అన్నారు. మత్స్యకారులు తీరప్రాంత రక్షకులని.. వారి కోసం ఆధునిక సాంకేతికతను తయారు చేయటం ద్వారా సంపద సృష్టించాలని నికుంజ్ పరాశర్ పేర్కొన్నారు.


31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 58 దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు సదస్సుకు తరలివచ్చారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీపై సీఐఐ ప్రత్యేకంగా దృష్టిసారించనుంది.


ఇవి కూడా చదవండి...

జనసేన నేతల పేర్లతో ఏడు కోట్ల రూపాయల మోసం..!

నెమ్మదిగా అడుగులు వేస్తున్న రాప్తాడు బాలిక: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 12:55 PM