విజయవాడలో దారుణం.. ప్రేమించిన యువతిని హత్య చేసి యువకుడి బలవన్మరణం
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:12 AM
రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో..
విజయవాడలో ప్రియురాలి గొంతు కోసి.. తానూ ఆత్మహత్య
విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. ఆ యువకుడిలో అనుమానపు పిశాచి కారణంగా చిచ్చురేగింది. కలిసి బతకాల్సిన తరుణంలో.. ప్రాణంగా ప్రేమించిన యువతిని హత్య చేసి.. ఆమె ఇంటి వద్దే తనూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె గొంతు కోసి చంపేశాక.. అదే ఇంటి మేడపైకెక్కి కిందికి దూకేసి మృతి చెందాడు. ఈ విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో శనివారం జరిగిందీ దారుణం. ఇక్కడి న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన పడాల మహాలక్ష్మి(19) రాజీవ్ గృహకల్ప అపార్టుమెంట్లలో నాన్నమ్మ శాంతమ్మ వద్ద ఉంటూ.. పంజా సెంటర్‌లోలోని ఓ వస్త్రదుకాణంలో పని చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా గుప్పిడిపేటకు చెందిన మక్కు చిన్నారావు(22) అదే అపార్టుమెంట్లలోని సీ బ్లాక్ ఉంటున్న తన అన్నయ్య మహేశ్ వద్ద ఉంటున్నాడు. అతడు శుభకార్యాల్లో మండపాలకు డెకరేషన్ చేస్తుంటాడు. పనులు ఉన్నప్పుడు అన్నయ్య వద్దకు వస్తుంటాడు. మహాలక్ష్మి, చిన్నారావు.. పక్కపక్క బ్లాక్‌ల్లో ఉండడంతో పరిచయం ఏర్పడింది. రెండేళ్లకు పైగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొద్దిరోజుల క్రితం చిన్నారావు ఇంట్లో చెప్పాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు మహాలక్ష్మి కుటుంబంతో సంప్రదింపులు చేశారు. ఈక్రమంలో ఇటీవల జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో మహాలక్ష్మి వేరొకరితో కలిసి డ్యాన్స్ చేసింది.
దీనిపై చిన్నారావు అనుమానం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చిన్నారావు మెసేజ్‌లు చేస్తున్నా ఆమె స్పందించడం లేదు. దీంతో ఆమెపై పగ పెంచుకున్న చిన్నారావు ఇంటి నుంచి కొబ్బరిబొండాలు కొట్టే కత్తి తీసుకుని మహాలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి బయట వంట సామగ్రిని శుభ్రం చేస్తున్న ఆమె గొంతుకోశాడు. ఆ సమయంలో ఆమె నాన్నమ్మ టిఫిన్ తెచ్చుకోవడానికి హోటల్‌కు వెళ్లింది. మహాలక్ష్మి గొంతు కోసిన తర్వాత అదే అపార్టుమెంట్‌పైకి ఎక్కి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. కొన ఊపిరితో ఉన్న మహాలక్ష్మిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. దీనిపై అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి: