Share News

అసలుకే మోసం!

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:29 AM

జిల్లా రోడ్లు, భవనాలశాఖ ఉద్యోగుల కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో అక్రమార్కుల గుర్తింపు ఒక ప్రహాసనంగా సాగుతోంది. చిన్న,చితకా ఉద్యోగాలు చేసుకుంటూ డిపాజిట్లు చేసిన ఉద్యోగులకు అసలు మొత్తాలు ఇంకా పూర్తిస్థాయి చెల్లింపుల జరగక పోవడంతో పర్సన్‌ ఇన్‌చార్జి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అసలుకే మోసం!
ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల సొసైటీ కార్యాలయం

అసలుకే మోసం!

కొలిక్కిరాని ఆర్‌అండ్‌బీ సొసైటీ అక్రమాలు

అక్రమార్కుల గుర్తింపులో నిర్లక్ష్యం

అసలు సొమ్ము రాక డిపాజిట్‌దారుల గగ్గోలు

డీసీసీబీకి రూ.72 లక్షల అప్పు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లా రోడ్లు, భవనాలశాఖ ఉద్యోగుల కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో అక్రమార్కుల గుర్తింపు ఒక ప్రహాసనంగా సాగుతోంది. చిన్న,చితకా ఉద్యోగాలు చేసుకుంటూ డిపాజిట్లు చేసిన ఉద్యోగులకు అసలు మొత్తాలు ఇంకా పూర్తిస్థాయి చెల్లింపుల జరగక పోవడంతో పర్సన్‌ ఇన్‌చార్జి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

జిల్లా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయం వెనుక భాగంలో ఈ సొసైటీ చాలాకాలంగా పనిచేస్తోంది. 2011 నుంచి 2017ల మఽధ్య ఆర్థిక అవకవతకలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 25 మంది డిపా జిట్‌దారులతో పాటు ఆరేడు మంది బయట వ్యక్తు లు ఇందులో డిపాజిట్లు చేశారు. వీరందరికి కలిపి దాదాపుగా రూ.40 లక్షలు వరకు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా 2016 కాలంలో ఏలూరు డీసీసీబీ నుంచి రెండు దఫాలుగా సొసైటీ పేరుతో 72.77 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దీనిలో సకాలంలోనే ఒక పద్దు కింద రూ.34.70 లక్షల వరకు అప్పులు తీర్చేశారు. ఇంకా రూ.40.70 లక్షల పైబడి అప్పులు కట్టాల్సి ఉంది. గత పదేళ్లకాలంలో అది కాస్త అసలు, వడ్డీ కలిపి రూ.72 లక్షల పైబడి పెరిగిపోయింది. ఇవి తీర్చాల్సి ఉండగా, డిపాజిట్‌దారులకు సగం సగం చెల్లింపులతో సహకారశాఖ నుంచి నియమితు లైన పర్సన్‌ ఇన్‌చార్జి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రూ.28 లక్షల వరకు చెల్లింపులు జరిగాయి. వాస్త వంగా ఇంకా రూ.12 లక్షలు వరకు బకాయిలు డిపా జిట్లు దారులకు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.

విచారణ పూర్తి కాలేదా?

సొసైటీలో వివిధ పదవుల్లో పనిచేసిన ముగ్గురు ఉద్యోగుల పాత్ర ఇందులో ఉంది. ఇద్దరు ఉద్యోగులు రిటైర్‌ అయ్యి ఏలూరులోనే తిరుగుతున్నారు. ఒక ఉద్యోగి డివిజన్‌ కార్యాలయంలోనే ఉద్యోగంలో ఉన్నారు. వీరి ముగ్గురి పాత్రపై విచారణ సవ్యంగా సాగలేదన్న ఆరోపణలున్నాయి. విచారణాధికారిగా జిల్లా సహకారశాఖ ఆడి ట్‌ కార్యాలయం నుంచి నియమితులైన ఒక ఉద్యోగి పదవీ విరమణ చేశారు. ఇంకా పూర్తిస్థాయి నివేదిక జిల్లా సహకార అధికారికి చేరలేదు. దీంతో ఈ ముగ్గురిపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించడానికి అవకాశం లేకుండా పోయిందని సమాచారం. ఇదిలా ఉండగా రుణాలు పొందిన ఏడెనిమిది మంది ఉద్యోగులు వారి బకాయి లను చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. వారు పొందు తున్న జీతాలపై ఈఎంఐలు, ఇతరత్రా బాకీలు ఉండడం వల్ల కూడా రుణాలు చెల్లింపులో జాప్యం చోటు చేసుకుంటోంది.ఈ కారణంగా నిష్పక్షపాతంగా అసలుకు వడ్డీ వస్తుందని డిపాజిట్‌ చేసిన ఉద్యోగులు సైతం వడ్డీలు కోల్పోగా, కనీసం అసలు ఇంకా చేతికందడం లేదు. ఈ విచారణ ఎప్పటికి పూర్తి చేస్తారో? అన్న అనుమానాలను డిపాజిట్‌ దారులు వ్యక్తం చేస్తున్నారు.

కొందరి స్వార్థం.. సొసైటీ దివాళా

ఆ ముగ్గురు అక్రమార్కుల చర్యలతో ఆర్‌అండ్‌బీ క్రెడిట్‌ సొసైటీ దివాళా తీసింది. మరోవైపు ప్రతి ఏటా మహాజన సభ పెట్టి వాస్తవాలను వెల్లడిం చాల్సి ఉండగా, గత పదేళ్లుగా ఈ మహాజన సభలు జరగడం లేదు. జిల్లా ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు దృష్టి పెడితే అక్రమార్కుల వ్యవహారం నిగ్గు తేలే అవకాశం ఉంది.

కొసమెరుపు : ప్రస్తుత ఎస్‌ఈ విజయరత్నం భీమవరం ఈఈగా ఉన్నప్పుడు ఈ సొసైటీలో కొంత మొత్తం డిపాజిట్‌ చేశారు. ఆయన మొత్తాలు ఇంకా చెల్లింపులు జరగలేదు.

నివేదిక రాలేదు ..

ఈ సొసైటీలో అక్రమాలు జరిగిన వ్యవహారం లో నివేదిక మాకు రాలేదు. నాకు ఉత్తర్వులు ఇచ్చిన గతేడాది సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు డిపాజిట్‌దారులకు అసలు కింద రూ.28 లక్షలు చెల్లించాం. ఇంకా చెల్లింపులు చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో రుణాలు తీసుకున్న వారు కడితేనే వారికి జమ చేయగలుగుతున్నాం. గతంలో సొసై టీ పాలక సభ్యులపై వచ్చిన ఆరోపణలపై నివే దిక అందిస్తే రెవెన్యూ రికవరీ యాక్టు కింద మొత్తాలు వసూలు చేస్తాం.

– కిరణ్‌కుమార్‌, పర్సన్‌ ఇన్‌చార్జి

Updated Date - Oct 04 , 2026 | 12:29 AM