Share News

ట్రేడింగ్‌ చీటింగ్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:42 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో ఎక్కడికక్కడే మోసాలు జరుగుతున్నాయి.

ట్రేడింగ్‌ చీటింగ్‌

ఎక్కడచూసినా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట మోసాలు

రూ.కోట్లు కొల్లగొట్టిన ‘క్యువీఎస్‌ఈ’

రెండు వారాల క్రితం మూత

తాజాగా డిపాజిట్లు సేకరిస్తున్న ‘ఎస్‌ఆర్‌ గ్లోబ్‌ ఎకానమీ షేరింగ్‌’

ఏజెంట్ల నియామకం

అక్కయ్యపాలెంలో రూ.8 కోట్లకు టోకరా

నిందితుల అరెస్టు

విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో ఎక్కడికక్కడే మోసాలు జరుగుతున్నాయి. బంధువులు, స్నేహితులనే లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ‘క్యువీఎస్‌ఈ’ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌లో అధికారులే పాత్రధారులుగా మారి అనేక మంది సొమ్మును పరుల చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ యాప్‌ మూతపడిందని పోలీసులు చెబుతున్నా...అదే తరహాలో ఆన్‌లైన్‌ డిపాజిట్లు వసూలు చేసే సంస్థలు ఇంకా అనేకం ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్నాయి.

ప్రస్తుతం ‘ఎస్‌ఆర్‌ గ్లోబ్‌ ఎకానమీ షేరింగ్‌’ పేరుతో కొందరు డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. కొందరు మోసగాళ్లు ముందుగానే తమకు బాగా కావలసిన వారి పేరుతో లక్ష రూపాయల చొప్పున ఆ సంస్థలో డిపాజిట్‌ చేయించి, వారికి సభ్యులను చేర్పించే అవకాశం కల్పించారు. వారిని గ్రామాలకు పంపించి డిపాజిట్లు వసూలు చేయాలని, అందులో కమీషన్లు వస్తాయని ఆశ చూపిస్తున్నారు. డిపాజిట్లు చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు. వారికి విశ్వాసం కలగడానికి వారి బ్యాంకు అకౌంట్లలో లాభం వచ్చినట్టు కొద్దికొద్ది మొత్తాలు డిపాజిట్‌ చేస్తున్నారు. వాటిని విత్‌డ్రా చేసి వాడుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు వస్తాయని, తెలిసిన వారికి కూడా చెప్పండని డిపాజిట్లు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌ గ్లోబల్‌ సంస్థ భీమిలి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో డబ్బులు సేకరిస్తోంది. కొందరికి ఫోన్లు కూడా చేసి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపుతోంది. పోలీసులు ఇలాంటి మోసకారుల మాటలు నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. డిపాజిట్లు చేస్తే మోసపోతారని సూచిస్తున్నారు.

రూ.8 కోట్ల మోసం కేసులో నిందితుడి అరెస్ట్‌

రైల్వేలో టీటీఈగా పనిచేసి రిటైరైన సదరం శివ, ఆయన కుమారులు ప్రేమసాగర్‌, దినేశ్‌లు ఇలా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో బంధువులు, స్నేహితుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ పెట్టి రూ.8 కోట్ల వరకు వసూలు చేశారు. ప్రేమ్‌సాగర్‌ ఆస్ట్రేలియాలో పనిచేసి ఇండియాకు వచ్చాడు. తనకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అనుభవం ఉందని బాగా లాభాలు వచ్చాయని నమ్మించి అందరితో పెట్టుబడులు పెట్టించాడు. కొందరు బంగారం తాకట్టు పెట్టి ఇవ్వగా, మరికొందరు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వెనక్కి తీసుకొని ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు ఇచ్చారు.

దీనిపై కాండ్రేగుల రమ్య వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బడ్స్‌ చట్టం కింద కేసు నమోదుచేసి ప్రేమ్‌సాగర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి బెదిరించడంతో అక్కయ్యపాలేనికి చెందిన ఉమామహేశ్వరి అనే మహిళ నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తండ్రి శివ, పెద్ద కుమారుడు ప్రేమసాగర్‌ను పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ విషయం తెలిసి మూడో నిందితుడు దినేశ్‌ తప్పించుకున్నాడు.

ఈసారి డాక్టర్‌ రామ్‌కుమార్‌ నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రూ.1.5 కోట్ల వరకు మోసం చేశారని ఫిర్యాదు చేయగా హైదరాబాద్‌లో దాక్కున్న దినేశ్‌ను పోలీసులు శుక్రవారం పట్టుకొని నగరానికి తీసుకువచ్చారు. తండ్రి, పెద్ద కుమారుడు ప్రేమసాగర్‌లు బెయిల్‌ నిబంధనలు పాటించడం లేదని, ఫోన్లకు కూడా అందుబాటులో లేరని పేర్కొంటూ వారి బెయిల్‌ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేసినట్టు తెలిసింది.

Updated Date - Oct 04 , 2026 | 12:42 AM