Share News

అటవీ భూముల్లో ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:27 AM

మండలంలోని పోలవరం ఫారెస్ట్‌లో శనివారం వందలాది మంది పేదలు అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారు.

అటవీ భూముల్లో ఉద్రిక్తత
తమ్మిలేరు కుడి కాలువ వద్ద అటవీ భూమిలో చెట్లు నరుకుతున్న పేదలు

పోలవరం ఫారెస్ట్‌లో భూముల ఆక్రమణకు పేదల యత్నం

చాట్రాయి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):మండలంలోని పోలవరం ఫారెస్ట్‌లో శనివారం వందలాది మంది పేదలు అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించారు. పోలవరం గ్రామానికి చెందిన వందల మంది పేదలు తమ్మిలేరు ప్రాజెక్టు కుడి కాలువ పక్కన, పోతనపల్లికి చెందిన పేదలు తమ్మిలేరు కట్ట సమీపంలో అటవీ భూముల్లో ప్రవేశించి చెట్లు తుప్పలు నరకడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న నూజివీడు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, చాట్రాయి ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో వచ్చి ఆక్ర మణలను అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు అధికారులతో మాట్లాడుతూ పోలవరం ఫారెస్ట్‌లో కొంతమంది అటవీ భూములు యథేచ్ఛగా ఆక్రమిస్తూ ఫెన్సింగ్‌, బోర్లు, మొక్కలు వేస్తుండగా ఫారెస్ట్‌ అధికారులు వారి వద్ద ముడుపులు తీసుకుంటూ వారికి ఇష్టమైనవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆరోపించారు. అదే నిరుపేదలు అర ఎకరం, పావు ఎకరం సాగు చేసుకుంటే పంటను ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేస్తున్నారని, ఇప్పటి వరకు అటవీ భూముల్లో ఉన్న ఆక్రమణలు తొలగిస్తేనే తమ గ్రామాల పేదలు వెనుదిరుగు తారని లేకపోతే ఆక్రమణలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, ఎస్‌ఐ, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అటవీ భూముల్లో ఒక్క అంగుళం కూడా ఆక్రమణ లను గురి కావడానికి వీల్లేదని, ఇప్పటి వరకు ఉన్న అటవీ ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అక్రమణలు నిలిపివేసి పేద లు వెనుదిరిగారు. కాగా ఏడాది క్రితం పోతనపల్లికి చెందిన పేదలు పోలవరం ఫారెస్ట్‌లో ఆక్రమణలు చేపట్టగా అప్పట్లోను అధికారులు అడ్డుకున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:27 AM