పెట్ స్కాన్‌కు ప్రతిపాదన
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:40 AM
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో క్యాన్సర్ రోగుల కోసం పెట్ (పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ...ఇది శరీరంలో కణజాలాల పరిశీలించడానికి చేసే వైద్య పరీక్ష) స్కాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కేజీహెచ్ అధికారుల విజ్ఞాపన
క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయుక్తం
కణాల పరిశీలన, వ్యాధి వ్యాప్తి, చికిత్స ప్రభావం తెలుసుకునేందుకు అవకాశం
మరో ఎంఆర్‌ఐ మెషీన్‌తోపాటు క్రిటికల్ కేర్ బ్లాక్‌కు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని వినతి
కొద్దిరోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆశాభావం
విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో క్యాన్సర్ రోగుల కోసం పెట్ (పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ...ఇది శరీరంలో కణజాలాల పరిశీలించడానికి చేసే వైద్య పరీక్ష) స్కాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. క్యాన్సర్‌కు వైద్యం చేయించుకునేందుకు ప్రతిరోజూ సుమారు 100 మంది వస్తుంటారు. ఇన్‌పేషెంట్లుగా మరో 60 మంది వరకు ఉంటారు. కొన్నిరకాల క్యాన్సర్లకు మెరుగైన వైద్యం అందించేందుకు పెట్ స్కాన్ చేయాల్సి ఉంటుందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. పెట్ స్కాన్ ద్వారా శరీరంలో క్యాన్సర్ కణాల చురుకుదనం, వ్యాధి వ్యాప్తి, చికిత్స ప్రభావం ఎలా ఉందనే విషయాలను పరిశీలించవచ్చునంటున్నారు. సాధారణంగా ఈ పరీక్ష బయట చేయించుకోవాలంటే సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చ వుతుంది. దాంతో సాధారణ, నిరుపేద ప్రజలకు ఈ పరీక్ష చేయించుకోవడం కష్టంగా మారుతోంది. ఇదే విషయాన్ని ఆస్పత్రి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కొద్దిరోజుల కిందట గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ప్రభుత్వం పెట్ స్కాన్‌ను మంజూరుచేసింది. తమకు కూడా ఇవ్వాలని కేజీహెచ్ అధికారులు కోరారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన చికిత్సను అందించగలుగుతామని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీని ఖరీదు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్లు వరకు ఉంటుంది.
ఎంఆర్‌ఐ మెషీన్, క్రిటికల్ కేర్ బ్లాక్ సిబ్బంది
ఆస్పత్రి అధికారులు మరో రెండు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. మరో ఎంఆర్‌ఐ మెషీన్ కావాలని కోరారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒకే ఎంఆర్‌ఐ మెషీన్ ఉంది. దీని ద్వారా రోజుకు 25 నుంచి 30 మంది రోగులకు పరీక్షలు చేయగలుగుతున్నారు. కానీ ఆయా విభాగాల నుంచి సుమారు వంద మంది రోగులకు వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో ఎంఆర్‌ఐ మెషీన్ మంజూరు చేయాలని ఆస్పత్రి అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, కొద్దిరోజుల కిందట క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమైంది. అయితే, ఇందులో 24 గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు సుమారు 50 మంది నర్సింగ్ సిబ్బంది, మరో 20 మంది వరకు నాలుగో తరగతి ఉద్యోగులు కావాలని అధికారులు కోరారు. ఈ మూడు కీలక ప్రతిపాదనలపై కొద్దిరోజుల్లో సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
రోగుల ఇబ్బందుల నేపథ్యంలో కీలక ప్రతిపాదనలు
- డాక్టర్ ఐ.వాణి, కేజీహెచ్ సూపరింటెండెంట్
రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. వీటిలో పెట్ స్కాన్, ఎంఆర్‌ఐ మెషీన్లు ఉన్నాయి. ఈ రెండు అందుబాటులోకి వస్తే చాలా వరకు రోగులు ఇబ్బందులను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, క్రిటికల్ కేర్ బ్లాక్‌లో సిబ్బంది కొరత ఉన్నట్టు ప్రభుత్వానికి తెలియజేశాం. గతంతో పోలిస్తే రోగుల సంఖ్య భారీగా పెరగడం వల్ల కొన్నిరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నాం.