శారదానది వ్యర్థాలమయం
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:30 AM
పట్టణానికి ఆనుకొని ఉన్న శారదానది వ్యర్థాలమయంగా కనిపిస్తోంది. గత నెల 22వ తేదీన పెద్ద ఎత్తున వినాయక ప్రతిమల నిమజ్జనోత్సవాలను శారదానది ఒడ్డున ఘనంగా చేశారు. నదిలోకి ఎవరూ దిగి ప్రతిమలను నిమజ్జనం చేయకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో క్రేన్ సహాయంతో నది ఘాట్ నుంచి కొంత దూరంలో నిర్వాహకులు నిమజ్జనం చేశారు.
- వినాయక ప్రతిమలు, చెక్కలతో నిండిపోయిన నిమజ్జనం ఘాట్
- అధ్వానంగా పరిసరాలు
అనకాపల్లి టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి ఆనుకొని ఉన్న శారదానది వ్యర్థాలమయంగా కనిపిస్తోంది. గత నెల 22వ తేదీన పెద్ద ఎత్తున వినాయక ప్రతిమల నిమజ్జనోత్సవాలను శారదానది ఒడ్డున ఘనంగా చేశారు. నదిలోకి ఎవరూ దిగి ప్రతిమలను నిమజ్జనం చేయకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో క్రేన్ సహాయంతో నది ఘాట్ నుంచి కొంత దూరంలో నిర్వాహకులు నిమజ్జనం చేశారు. అయితే శారదానది పాత వంతెన కింద, కొత్త వంతెన కింద, నిమజ్జన ఘాట్ వద్ద ఎక్కడపడితే అక్కడ గణనాథుని ప్రతిమలు శిథిల స్థితిలో దర్శనమిస్తు న్నాయి. నది ప్రవాహం లేకపోవడంతో వినాయక ప్రతిమలతో నిండిపోయింది. కొంత మేర వ్యర్థాలను సిబ్బందితో జోనల్ కమిషనర్ చక్రవర్తి తొలగించారు. అయితే వినాయక ప్రతిమలు, దానికి ఉపయోగించిన చెక్కలు, ఇతర వస్తువులు నది ఒడ్డున నిలిచి ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో దేవీ నవరాత్రుల సందర్భంగా చాలా మంది భక్తులు భవాని మాలలు ధరించి శారదానదిలో స్నానాలు చేస్తారు. అయితే నది పరిస్థితి దుర్భరంగా ఉండడంతో భవాని భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శారదానది వినాయక నిమజ్జన ఘాట్, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని పలువురు కోరుతున్నారు.