Share News

భూముల రక్షణ కోసం సుప్రీం కోర్టుకు 2,500 మంది ఆదివాసీలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:49 PM

ఏజెన్సీ ప్రాంతాల్లోని తమ పూర్వీకుల భూములను ఆక్రమణలు, చట్టవిరుద్ధ బదలాయింపుల నుంచి కాపాడుకునేందుకు ఏపీకి చెందిన 2,500 మంది షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన రైతులు ఏకమయ్యారు. తమ హక్కుల పరిరక్షణ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సీనియర్ న్యాయవాది అల్లంకి రమేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

భూముల రక్షణ కోసం సుప్రీం కోర్టుకు 2,500 మంది ఆదివాసీలు
tribal land protection

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: తమ పూర్వీకుల భూములను ఆక్రమణలు, బదలాయింపుల నుంచి కాపాడుకోవడానికి ఏపీకి చెందిన 2,500 మంది షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన రైతులు ఒకే తాటిపైకి వచ్చి సుప్రీం కోర్టును ఆశ్రయించారని న్యాయవాది అల్లంకి రమేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గిరిజనులకు ఈ భూములు కేవలం ఆస్తులు కాదని, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని పేర్కొన్నారు. అందుకే వీరు తమ హక్కుల సాధన కోసం సుదీర్ఘ న్యాయపోరాటానికి దిగారని వివరించారు.


కాగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24, 19(5), 5 షెడ్యూల్ ఆధారంగా గిరిజనులకు లభించిన ప్రత్యేక హక్కులను కాపాడాలని వర్ష రాంబాబు, ఆధార్ సొసైటీ సభ్యులతో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టపరమైన సవాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు నియంత్రణ చట్టం (1/70 యాక్ట్) పై ఆధారపడి ఉంది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ‘పి. రామిరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (1988) 3 SCC 433’ కేసులో మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. గిరిజనుల సామాజిక-ఆర్థిక మనుగడను కాపాడాలనే లక్ష్యంతో గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు జరిగే భూ బదలాయింపులపై ఉన్న సంపూర్ణ నిషేధాన్ని ఆనాడు సుప్రీంకోర్టు సమర్థించింది.

1978లోని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1)(f) కింద ఉన్న ఆస్తి ప్రాథమిక హక్కును రద్దు చేశారని, కేవలం గిరిజనులకు మాత్రమే ఆర్టికల్ 244, 19(5), 5వ షెడ్యూల్ కింద ప్రత్యేక హక్కులు ఉన్నాయని 1988 తీర్పులోనే అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసినట్లు పిటిషనర్లు గుర్తుచేశారు.


గిరిజనుల భూములకు ఎందుకు ప్రత్యేక రక్షణ?

ఈ సందర్భంగా పిటిషనర్లు గిరిజనుల భూములకు ఎందుకు ప్రత్యేక రక్షణ అవసరమో వివరించారు. ‘గిరిజనులు తరతరాలుగా అటవీ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. 1874 నుంచి 1950 మధ్య కాలంలో నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లేమి కారణంగా భూస్వాములు, వడ్డీ వ్యాపారులు తదితర గిరిజనేతరుల చేతిలో గిరిజనులు దోపిడీకి గురయ్యారు. ఈ పరిస్థితుల నుంచి అమాయక గిరిజనులను కాపాడేందుకు ప్రభుత్వం 1/1959 రెగ్యులేషన్, ఆ తర్వాత సవరించిన 1/70 రెగ్యులేషన్ ద్వారా రక్షణ కల్పించింది’ అని పిటిషనర్లు తెలిపారు.


సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు..

కొందరు గిరిజనేతరులు సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. 1970 తరువాత గిరిజన ప్రాంతానికి వలస వచ్చిన వీరు.. నిరక్షరాస్యులైన గిరిజనుల భూములను ఆక్రమించారని చెప్పారు. అయితే యారంశెట్టి సత్యనారాయణ, సూరిరెడ్డి రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో రద్దయిన ఆర్టికల్ 19(1)(ఎఫ్)ను ఆధారంగా చూపిస్తూ 1/70 చట్టంలోని సెక్షన్ 3(1)(ఏ)ను రద్దు చేయాలని కోరడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనని వివరించారు. అందుకే ఈ అక్రమ పిటిషన్‌ను వెంటనే కొట్టివేయాలని 2,500 మంది ఆదివాసీలు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.


ఈ వార్తలూ చదవండి

చిత్తూరులో గజరాజుల సంచారం.. కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలని పవన్ ఆదేశాలు

ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా.. రూ.55 కోట్లతో సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

Updated Date - Sep 28 , 2026 | 05:01 PM