Share News

ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా.. రూ.55 కోట్లతో సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:21 PM

ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్‌ మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో రూ.55 కోట్లతో నిర్మించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.

ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా.. రూ.55 కోట్లతో సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
AP Minister Gottipati Ravikumar

పశ్చిమ గోదావరి: ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్‌ మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో రూ.55 కోట్లతో నిర్మించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లాలోని ఆక్వా రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.50కే సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. రాయితీపై విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అందిస్తున్నామని పేర్కొన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.6 వేల కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచామని చెప్పుకొచ్చారు. పీక్ అవర్స్‌లో అవసరమైతే తక్కువ ధరకే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఆక్వా రైతులకు నిరంతర సరఫరా నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.


ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని, అయినప్పటికీ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం వెనుకబడిందని విమర్శించారు. గతంలో ప్రతి ఆరు నెలలకు ఏదో ఒక రూపంలో ఛార్జీలు పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూ డౌన్ చేశామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఘనంగా విజయవాడ ఉత్సవ్-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం..

చిత్తూరులో గజరాజుల సంచారం.. కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలని పవన్ ఆదేశాలు

Updated Date - Sep 28 , 2026 | 04:21 PM