బస్సు చక్రాల కింద పడి మృతిచెందిన మూడేళ్ల చిన్నారి
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:13 PM
బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతదేహం చూసి బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు
పల్నాడు, సెప్టెంబర్ 23: పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల మండలంలో హృదయవిదారక ఘటన జరిగింది. బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల చిన్నారి మంగళవారం మృతి చెందాడు. కళ్లముందే కన్నకొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకెలకూరపాడు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే సాగరబాబు, రాజకుమారి దంపతులకు సిద్ధార్థ, నితిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సిద్ధార్థ ముప్పాళ్లలో ప్రీ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు. రోజూ పాఠశాల బస్సులో ఈ బాలుడు బడికి వెళ్తాడు. మంగళవారం ఉదయం సిద్ధార్థను బస్సు ఎక్కించడానికి తల్లి రాజకుమారి తీసుకువెళ్లింది. తల్లి వెనుకే చిన్నారి నితిన్ కూడా వచ్చాడు. రోడ్డు దాటుతున్న నితిన్‌ను డ్రైవర్ గమనించకుండా బస్సు పోనిచ్చాడు. దీంతో నితిన్ కింద పడిపోయాడు. బస్సు వెనుక చక్రం అతడి పైనుంచే వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు.
నితిన్ మరణంతో రాజకుమారి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానికులు రావడంతో డ్రైవర్ పారిపోయాడు. అయితే కుమారుడి మృతదేహం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘నితిన్ లేవరా.. ఆడుకుందాం’ అంటూ రోదించారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
భారీ వర్షాలు.. ఆర్టీసీ అధికారులకు మంత్రి మండిపల్లి ఆదేశాలివే
ఎల్‌నినోపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు