మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయండి
ABN , Publish Date - Aug 01 , 2026 | 09:02 AM
మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహిళ అని కూడా చూడకుండా విధుల్లో ఉన్న ఎస్‌ఐపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
శ్రీకాకుళం ఘటనపై సర్కారు సీరియస్
అందరిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు.. పోలీసులకు డీజీపీ ఆదేశం
21 మందిపై కేసులు నమోదు.. ఏ1గా ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి
అమరావతి/శ్రీకాకుళం, జూలై 31(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహిళ అని కూడా చూడకుండా విధుల్లో ఉన్న ఎస్‌ఐపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఘటనతో సంబంధం ఉన్న అందరిపై కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. డీజీపీ కార్యాలయం నుంచి శ్రీకాకుళం పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. మహిళా ఎస్‌ఐపై దాడి చేసిన వారిని, పోలీసులపైకి దూసుకెళ్లిన వారిని వదిలిపెట్టవద్దని, అందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రధాని, సీఎం పర్యటనలు ఉన్నప్పటికీ ఈ కేసులో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైసీపీ శ్రేణులపై కేసులు
ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్‌ఐను చుట్టిముట్టి అసభ్యంగా వ్యవహరించిన కేసులో పోలీసులు ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్, మరో 20 మందిపై కేసులు నమోదు చేశారు. మహిళా ఎస్‌ఐ ప్రవల్లిక శుక్రవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు. ఏ1గా చింతాడ రవికుమార్, మరో 20 మంది ఆయన అనుచరులపై 109, 189(2), 191(2), 221, 121, 74, 79, 351(2), రెడ్ విత్ 190 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన విషయం అధికారికంగా బయటకు రాకముందే.. తనపై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో వివరిస్తూ నిందితుడు చింతాడ రవికుమార్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ఇక జగన్ పర్యటన సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైసీపీ శ్రేణులపైనా కేసులు నమోదు చేసే అంశా న్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు కుమారులు తదితరులపై కేసు నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.