వైసీపీ నేతలది గుంట నక్కల రాజకీయం: కేంద్ర మంత్రి రామ్మోహన్
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:26 PM
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారితమని, జిల్లా ప్రజలకు సాగునీటి భద్రత కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వంశధార నీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను సస్యశ్యామలం చేయాలని పూనుకున్నట్లు ఆయన చెప్పారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారితమని, జిల్లా ప్రజలకు సాగునీటి భద్రత కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వంశధార నీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను సస్యశ్యామలం చేయాలని పూనుకున్నట్లు ఆయన చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో శ్రీకాకుళంలో సాగునీటి వ్యవస్థను గాలికి వదిలేశారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. 2010లో వంశధార ట్రైబ్యునల్ ఏర్పాటు అయ్యిందని.. అప్పటి నుంచి నేరడి బ్యారేజ్ విషయంలో ఒడిశాతో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసినట్లు ఆయన చెప్పారు.
నేరడి బ్యారేజ్ సమస్యకు చెక్..
2024లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నేరడి బ్యారేజ్ సమస్యపై దృష్టి పెట్టామని ఈ సందర్భంగా రామ్మోహన్ చెప్పుకొచ్చారు. ఒడిశాలోనూ బీజేపీ ప్రభుత్వం రావటంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. వంశధార ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకున్నామని.. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారమైందని తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అయినా తన మొదటి ప్రాధాన్యత జిల్లా అభివృద్ధికే అని రామ్మోహన్ స్పష్టం చేశారు.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
త్వరలో నేరడి బ్యారేజ్ పనులు ప్రారంభమవుతాయని.. రైల్వే జోన్ సాధించుకోవటం మరో విజయమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఉద్దానం ప్రాంతంలోని ఏడు రైల్వేస్టేషన్లను కొత్త రైల్వే జోన్‌లో పెట్టించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తిరుపతి వెళ్లే భక్తుల కోసం హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ఇకపై శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందంటూ ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశామని.. పొందూరు ఖాదీకి జియో ట్యాగ్ సాధించామనీ వెల్లడించారు. కేంద్రం నుంచి జిల్లాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూస్తున్నానని రామ్మోహన్ పేర్కొన్నారు.
అభివృద్ధిని వైసీపీ జీర్ణించుకోలేదు..!
జిల్లాలో అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ ఆగ్రహించారు. ప్రజల కోసం పని చేసే నేతలైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసిన పనులను అభినందించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం చరిత్రాత్మక ఘట్టమని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అమరావతి బిల్లుకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిందని.. జగన్ పార్టీ మాత్రం బిల్లు సందర్భంగా పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిందని మండిపడ్డారు. అమరావతి చట్టబద్ధత కోసం సీఎం చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారని చెప్పుకొచ్చారు. రాజధానిగా అమరావతికి రాష్ట్ర ప్రజలు ఎన్నికల ద్వారా సంపూర్ణ మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
వైసీపీకి ఇంకా బుద్ది రాలేదు..
అధికారంలో ఉన్నప్పుడు రాజధానిపై జగన్ మూడు ముక్కలాట ఆడారని.. ఇప్పుడూ అదే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి పూర్తయితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న భయం వైసీపీదని ఆరోపించారు. జాతీయస్థాయిలో చంద్రబాబుది ఓ ప్రత్యేక గుర్తింపని కొనియాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేది వైసీపీ అజెండా అయితే.. చంద్రబాబుది అభివృద్ధి అజెండా అని పేర్కొన్నారు. ప్రజలు ఛీ కొట్టినా వైసీపీకి ఇంకా బుద్ది రాలేదని.. చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమంటూ నిప్పులు చెరిగారు. విశాఖ రాజధాని పేరుతో వైసీపీ నేతలు భూదందా చేశారని ఆరోపించారు రామ్మోహన్ నాయుడు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పూర్తవుతాయని.. కేంద్రం సహకారంతో రాష్ట్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఒక పక్క అభివృద్ధి జరుగుతుంటే మరో పక్క వైసీపీ నేతలు గుంట నక్క రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైఎస్ఆర్ మృతిపై బొత్స కన్నీరు పెట్టారు కానీ జగన్ పాత్రను ఖండించలేదు: సోమిరెడ్డి
భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు