‘కొత్త పలుకు’పై వైసీపీ వ్యాఖ్యలు.. కేబినెట్‌లో చర్చ.. సీఎం ఫైర్
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:52 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
అమరావతి, ఏప్రిల్ 10: ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ‘కొత్త పలుకు’పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏబీ కేబినెట్‌లో(AP Cabinet) చర్చ జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘కొత్త పలుకు కాదు... ఇక పలుకే ఉండదు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు రామానాయుడు కేబినెట్‌కు తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘లేపేస్తాను అని అంటున్నారు... వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ఎవరిని లేపుతారు.. ఇటువంటి క్రిమినల్స్ చేసే బెదిరింపులకు ఎవరూ భయపడరు’ అని సీఎం అన్నారు.
క్రిమినల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్మ్‌గా డీల్ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బెదిరించి భయపెడదామని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలని, అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ‘క్రిమినల్స్ ఇలానే రాజకీయాలు చేస్తారు. వాళ్ల ఆటలు సాగనివ్వకూడదు. ప్రజలకు నిజాలు తెలియచేస్తే సరిపోతుంది. డైవర్షన్ పాలిటిక్స్‌కు వాళ్లు అలవాటు పడ్డారు’ అంటూ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు.
కేబినెట్ అజెండా లీక్‌పై చర్చ
కేబినెట్ అజెండా లీక్ అవుతున్న విషయంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ‘కేబినెట్ అజెండా బయటకు వెళ్తుంది. అందరం బాధ్యతగా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి... ముందు మన వద్దకు వస్తుంది’ అని సీఎం అన్నారు. గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరు లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని సీఎం గుర్తు చేశారు. పేపర్ లీక్ కేసులో ఆ రోజు బాలయోగి రాజీనామా చేశారని చెప్పారు. ఇప్పుడు సాంకేతికతతో ఎవరి నుంచి లీక్ అయిందో తేలికగా కనుక్కోవచ్చని స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు బాధ్యతగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి...
రాను రాను వ్యవస్థలు క్లిష్టంగా మారుతున్నాయి.. అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం
రామాయపట్నం పోర్టు పనులు వేగవంతం.. డ్రెడ్జింగ్, రోడ్డు-రైలు కనెక్టివిటీపై ఫోకస్
Read Latest AP News And Telugu News