Share News

వరంగల్ తల్లీకూతుళ్ల హత్య కేసు.. పది మంది అరెస్ట్

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:04 PM

వరంగల్ తల్లీ కూతుళ్ల హత్య కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకే పుట్టాలన్న కోరికతో నిందితుడు అజారుద్దీన్ ఈ దారుణానికి పాల్పడినట్లు సీపీ తెలిపారు.

వరంగల్ తల్లీకూతుళ్ల హత్య కేసు.. పది మంది అరెస్ట్
Warangal Case

వరంగల్, ఏప్రిల్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో భర్తతో పాటు పది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లు బాల్నె పూర్ణిమ, ఎస్.రవళి పరారీలో ఉన్నారు. ఐనవోలు మండలం పున్నెలులో ఈనెల 1న భార్య, ఇద్దరు కూతుళ్లను భర్త స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేసి చంపేసిన ఘటన సంచలనం రేపింది. భార్యకు ఆడపిల్లలే పుడుతున్నారని భర్త అజారుద్దీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.


అప్పటికే భార్య ఫరహాత్ గర్భవతి. ఫరహాత్‌కు గతంలోనూ రెండు అబార్షన్లు చేయించాడు అజారుద్దీన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లీకూతళ్ల హత్యకు సహకరించిన కుటుంబ సభ్యులతో పాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన సిబ్బంది, అబార్షన్లు చేసిన డాక్టర్లను నిందితులుగా తేల్చారు.


పథకం ప్రకారమే హత్య: సీపీ సన్ ప్రీత్ సింగ్

కొడుకే పుట్టాలన్న కోరికతో నిందితుడు అజారుద్దీన్.. భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అప్పటికే భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి రెండు అబార్షన్లు చేయించాడని.. మరోసారి భార్య ఫరహాత్ గర్భం దాల్చడంతో ఆమెకు మళ్లీ ఆడపిల్లే పుడుతుందన్న భయంతో చంపేసినట్లు వివరించారు. ఓ బాలికను వివాహం చేసుకోవాలని అనుకున్నాడని.. పథకం ప్రకారమే భార్య, పిల్లలను తన స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లి నీళ్లలో ముంచి చంపేసినట్లు చెప్పారు. అయితే.. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసులో.. సెక్షన్లను మార్చి నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని తెలిపారు. ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తామన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన వారిపై గతంలోనూ కేసులున్నాయని సీపీ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. మరోసారి డీఏ పెంపు

జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలన.. కవిత సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 02:04 PM