ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. మరోసారి డీఏ పెంపు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:06 PM
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు(Telangana RTC) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రకటించారు. ఇంతకు ముందు 50.7 శాతంగా ఉన్న డీఏను ఇప్పుడు 52.8 శాతానికి పెంచారు. పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. గడిచిన మూడు నెలల డీఏ బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ఒక్కో నెలకు చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ డీఏ పెంపు వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది.
గత ఏడాది జూలై 2025లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 2.1 శాతం డీఏ పెంచిన విషయం తెలిసిందే. 48.6 శాతం నుంచి 50.7 శాతానికి డీఏను పెంచింది సర్కార్. ప్రస్తుతం మరో 2.1 శాతం పెంపుతో డీఏ 52.8 శాతానికి చేరుకుంది. మే 2024లో ఆర్‌పీఎస్(RPS)-2017 అమలు తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ బకాయిలు లేవని అధికారులు స్పష్టం చేశారు. డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డీఏ పెంపుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం
ఈ సందర్భంగా ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై రీజియన్ మేనేజర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జనవరి 2026 నుంచి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చిందని... దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరిందన్నారు. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు భవిష్యత్తులో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం.. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కేంద్రంగా పని చేస్తోందని మంత్రి తెలిపారు. ఆర్టీసీలో కార్మికుల సంక్షేమం కోసం ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, రిమూవ్ అయిన ఉద్యోగులను త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి నియామకం, కొత్త నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణలో లైఫ్ లైన్‌గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
మా ధ్యేయం అదే: ఆర్టీసీ ఎండీ
ఆర్టీసీ సిబ్బంది ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఏను ప్రకటించడం సంతోషంగా ఉందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈడీలు సి.హెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఎఫ్‌ఏ విజయపుష్ప, సీ&ఎం శ్రీధర్, సీపీఎం ఉషాదేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏసీ వాటర్ వివాదం.. అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి
అతీతశక్తులంటూ మోసం.. మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు
Read Latest Telangana News And Telugu News