రాను రాను వ్యవస్థలు క్లిష్టంగా మారుతున్నాయి.. అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:51 PM
ఏపీ కేబినెట్ సమావేశంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వ్యవస్థలు రాను రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, ఏప్రిల్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. కేబినెట్ సమావేశం ప్రారంభమైనా అజెండా మాత్రం మంత్రులకు రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. అజెండా ముందే వస్తే స్టడీ చేసుకుని కేబినెట్‌కు వచ్చే వీలు ఉండేదన్నారు. దీంతో వివిధ శాఖల కార్యదర్శుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలు రాను రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ అధికారుల తీరను ముఖ్యమంత్రి తప్పుబట్టారు.
కార్యదర్శులు గతంలో సబ్జెక్టుల్లో భాగస్వాములవుతూ చర్చల్లో ఏ సందేహం వచ్చినా పూర్తిగా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడా పరిస్థితి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీమ్డ్ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఎక్కువ ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించారు. 10 ఎకరాలు తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి నాణ్యత పెంచుతూ ఎక్కువ సంఖ్యలో డీమ్డ్ యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని సీఎం తెలిపారు.
మంత్రులు ఓనర్‌షిప్ తీసుకోవాలి: సీఎం
జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను మంత్రులు ఓనర్ షిప్ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి నాలుగు కార్యక్రమాల్లో అయినా పాల్గొనాలని ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేలూ ఇదే అనుసరించాలన్నారు. జలధారకు ఉపాధి హామీ నిధులు అనుసంధానం అయ్యేలా పనులు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ కింద వీలైనన్ని ఎక్కువ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ ఉండాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల నివారణకు కృషి చేసేలా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏసీ వాటర్ వివాదం.. అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి
పాము కాటుకు గురైన బాలిక.. ఆస్పత్రికి తరలించే లోపే..
Read Latest AP News And Telugu News