వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:43 PM
భారత దిగ్గజం రవిశాస్త్రికి అరుదైన గౌరవం లభించింది. ఆయన సొంత మైదానం వాంఖడేలోని ఒక స్టాండ్‌కు ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ) రవిశాస్త్రి పేరు పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత దిగ్గజం రవిశాస్త్రికి అరుదైన గౌరవం లభించింది. ఆయన సొంత మైదానం వాంఖడేలోని ఒక స్టాండ్‌కు ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ) రవిశాస్త్రి పేరు పెట్టింది. భారత మాజీ క్రికెటర్లు ఏక్‌నాథ్ సోల్కర్, దిలీప్ సర్దేశాయ్, మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీలను కూడా ఎంసీఏ గౌరవించింది. వాంఖడే స్టేడియంలోని గేట్లకు వారి పేర్లను పెట్టింది. సోల్కర్, సర్దేశాయ్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవి శాస్త్రి భావోద్వేగానికి గురయ్యాడు. 12 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు వాంఖడేలో తొలిసారిగా అడుగుపెట్టానని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.
‘వాంఖడేలోనే నా ప్రయాణం మొదలైంది. ఇక్కడే పోరాడటం నేర్చుకున్నా. ఎప్పటికీ వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఎంసీఏ ఇచ్చిన గౌరవం నాకు ఎంతో ప్రత్యేకం. మా అమ్మకు క్రికెటరంటే ప్రాణం. నా పేరుతో వాంఖడేలో స్టాండ్ వస్తుందని తెలిసి అమ్మ ఎంతో గర్వించింది. నా మ్యాచ్‌లు చూసేందుకు కుటుంబమంతా చాలా ఏళ్లపాటు స్టేడియానికి వచ్చింది. అయితే ఒకానొక దశలో స్టేడియంలోని ప్రేక్షకులు నన్ను ఎగతాళి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనస్తాపం చెందిన మా నాన్న ‘నేను మళ్లీ స్టేడియానికి రాను’ అని వెళ్లిపోయారు. ఆ తర్వాత నిజంగానే ఆయనెప్పుడు రాలేదు. అనంతరం భారత జట్టుకు కోచ్‌గా పనిచేశా. ఎగతాళి చేసిన వాళ్లే ఆ తర్వాత నన్ను ప్రశంసించారు. ఇప్పుడు మా నాన్న ఉంటే చాలా సంతోషించేవారు. వాంఖడేలో బరోడాపై ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్సర్లు నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం’ అని రవి శాస్త్రి భావోద్వేగానికి గురయ్యాడు.
ఇవి కూడా చదవండి:
అలెన్ క్యాచ్ వివాదం.. మా ఓటమికి అదే కారణం కాదు: కేకేఆర్ ప్లేయర్ పావెల్
విధ్వంసకర విన్యాసాల వీరుడు.. అసలెవరీ ముకుల్ చౌదరి!