నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:00 PM
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సంచలన విజయాన్ని అందించాడు 22 ఏళ్ల ముకుల్ చౌదరి. తాజాగా ముకుల్ తండ్రి దిలీప్ చౌదరి తన కొడుకు ఆడిన తీరుపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ముకుల్ మేనియా నడుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సంచలన విజయాన్ని అందించాడు 22 ఏళ్ల ముకుల్ చౌదరి. లఖ్‌నవూకు దాదాపు ఓటమి ఖాయం అనుకున్న సమయంలో క్రీజులోకి వచ్చి విధ్వంసం సృష్టించాడు. 8వ వికెట్‌కు అవేశ్ ఖాన్‌తో కలిసి ఏకంగా 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇందులో 21 బంతులు ముకులే ఆడేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌ను తన తండ్రికే అంకితం చేస్తున్నట్లు ముకుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ముకుల్ తండ్రి దిలీప్ చౌదరి తన కొడుకు ఆడిన తీరుపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన కొడుకు క్రికెటర్ అవ్వడం కోసం ఓ తండ్రి చేసిన త్యాగాల కథ ఇప్పుడు ప్రతి హృదయాన్ని కదిలిస్తోంది.
‘నా కొడుకును క్రికెటర్ చేయాలన్న కల ఇప్పటిది కాదు. నాకు పెళ్లి కాకముందు నుంచే నాకు కొడుకు పుడితే క్రికెటర్‌ను చేస్తానని కలలు కనేవాడిని. ఆ కలను నిజం చేయడానికి ఎంతటి కష్టాన్ని అయినా భరించాలని సిద్ధపడ్డాను. ఆర్థిక పరిస్థితుల కారణంగా మా ఇంటిని అమ్మేశాం. దాదాపు రూ.21 లక్షలు వచ్చాయి. కానీ ముకుల్ క్రికెటర్ అవ్వడానికి ఆ డబ్బు సరిపోలేదు. తర్వాత హోటల్ ప్రారంభించా. దాని కోసం అప్పులు తీసుకున్నా. అవి తీర్చలేకపోవడంతో నాపైన కేసులు పెట్టారు. చాలా కాలం జైలు జీవితం కూడా అనుభవించా. అంతే కానీ నా కలను మాత్రం వదల్లేదు’ అని దిలీప్ భావోద్వేగానికి గురయ్యారు.
అవే నాకు ధైర్యానిచ్చాయి..
‘అప్పులపాలై జైలుకి వెళ్లి తిరిగొచ్చా. నా బంధువులే నన్ను తీవ్రంగా నిరుత్సాహపర్చారు. ఎన్నో విమర్శలు చేశారు. నాకు పిచ్చి పట్టిందన్నారు. నా జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నా కొడుకు జీవితాన్ని కూడా కష్టాల్లోకి నెడుతున్నానని అన్నారు. కానీ వాళ్లు చేసిన ఆ విమర్శలే నాకు మరింత ధైర్యాన్నిచ్చాయి. నాకు చిన్నప్పటి నుంచి కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. అయితే 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఎంఎస్ ధోని సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. అప్పటి నుంచి ముకుల్‌కు ధోని అంటే పిచ్చి. మ్యాచ్ గెలిచాక.. ముకుల్ దగ్గరికి వెళ్లి ‘నాన్నా, ఏడ్చావా?’ అని అడిగా. నా కొడుకు చిన్న చిరునవ్వుతో తలదించుకున్నాడు. ఇది ముకుల్ రోజు’ అని దిలీప్ చౌదరి ఆనందబాష్పాలు చిందించారు.
ఇవి కూడా చదవండి:
అలెన్ క్యాచ్ వివాదం.. మా ఓటమికి అదే కారణం కాదు: కేకేఆర్ ప్లేయర్ పావెల్
విధ్వంసకర విన్యాసాల వీరుడు.. అసలెవరీ ముకుల్ చౌదరి!