కోర్టుకు మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులు.. మరోసారి కస్టడీ కోరనున్న పోలీసులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:33 PM
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కోర్టుకు తరలించారు. రెండు రోజుల కస్టడీ పూర్తి అవడంతో ముగ్గురు నిందితులను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో ముగ్గురు నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మలను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. మూడోసారి రెండు రోజుల పోలీసు కస్టడీ విచారణ పూర్తి చేసిన అనంతరం ఈ ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి, మరో ఇద్దరు నిందితుల బ్యాంకు లావాదేవీలపై లోతుగా విచారణ చేశారు. దుబాయిలో నిందితులకు సంబంధించిన అకౌంట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిందితులు అనేక ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఈ కేసు సంబంధించి మరింత విచారణ అవసరమని పోలీసులు అభిప్రాయపడ్డారు. దీంతో మరో ఐదు రోజుల పోలీసు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే మూడోసారి కస్టడీ విచారణ జరిగినప్పటికీ.. డ్రగ్స్ సోర్స్, ఫైర్ ఆర్మ్స్ వినియోగం, దుబాయి కనెక్షన్లు, బ్యాంకు లావాదేవీలు వంటి అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో మార్చి 14న ఈగల్ టీమ్ దాడి చేసి డ్రగ్స్ పార్టీ గుట్టును రట్టు చేసింది. ఈ సందర్భంగా కొకైన్, లిక్కర్ బాటిళ్లు, ఫైర్ ఆర్మ్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఈ కేసు దర్యాప్తు కోసం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. నిందితులు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలన.. కవిత సంచలన వ్యాఖ్యలు
వరంగల్ తల్లీకూతుళ్ల హత్య కేసు.. పది మంది అరెస్ట్
Read Latest Telangana News And Telugu News