Share News

సీఎం వస్తున్నా.. ఇంత నిర్లక్ష్యమా?

ABN , Publish Date - May 06 , 2026 | 12:24 AM

Collector angry over MPDO and EO's behavior ‘సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? కనీసం యాక్షన్‌ ప్రణాళిక రూపొందించరా?’ అంటూ నరసన్నపేట పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఈవో ద్రాక్షాయణిపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం వస్తున్నా.. ఇంత నిర్లక్ష్యమా?
సీఎం పర్యటన ఏర్పాట్లుపై చర్చిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ఎంపీడీవో, ఈవో తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం

పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం

నరసన్నపేట, మే 5(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? కనీసం యాక్షన్‌ ప్రణాళిక రూపొందించరా?’ అంటూ నరసన్నపేట పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఈవో ద్రాక్షాయణిపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసన్నపేటలో ఈ నెల 16న సీఎం చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, హెలీప్యాడ్‌, సీఎం చంద్రబాబు స్థానికులతో మాట్లాడేందుకు వీలుగా రచ్చబండ ఏర్పాటు తదితర విషయాలపై చర్చించారు. కాగా ఇప్పటివరకూ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించక పోవడంతో ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఈవో ద్రాక్షాయణిపై కలెక్టర్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని ఏ వీధికి తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్తారు. డంపింగ్‌యార్డులో పరిస్థితి.. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ తదితర విషయాలపై సమాధానాలు ఇవ్వకపోవడంతో కస్సుబుస్సు లాడారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. ఇలా అయితే ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతానని, అధికారులు సరిగా పనిచేయడం చెప్తానని పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కాలువలు శుభ్రం చేయాలి. ఇంటింటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాల’ని ఆదేశించారు. భద్రత అంశాలపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో చర్చించారు. అనంతరం డంపింగ్‌ యార్డు, ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, తహసీల్దార్‌ ఆర్‌.సత్యనారాయణ, ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఈవో ద్రాక్షాయణి పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:24 AM