భూకబ్జాలో సూత్రధారి సీతారాం.. పాత్రధారి ఆయన కుమారుడు: ఎమ్మెల్యే కూన రవికుమార్
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:47 PM
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి దిగువస్థాయి నాయకుడి వరకూ అక్రమాలు, అరాచకాలు చేశారని ఆరోపించారు.
శ్రీకాకుళం, జులై 21: వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ గొడ్డలి పార్టీ అని, దానికి అధ్యక్షుడు జగన్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి దిగువస్థాయి నాయకుడి వరకూ అక్రమాలు, అరాచకాలు చేశారని ఆరోపించారు. భారత దేశంలో అత్యంత అరాచక పార్టీ వైసీపీ అంటూ ధ్వజమెత్తారు. 2019-24 మధ్య రాష్ట్రంలో ఫ్యాక్షన్ పరిపాలన సాగిందన్నారు. వైసీపీ అరాచక పాలనలో భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా సాగిందన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా పని చేసిన తమ్మినేని సీతారాం.. బతికున్న వ్యక్తిని కాగితాల్లో చంపేసి ఆస్తులు కొట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతను అసెంబ్లీలో అవమానపరిచిన వ్యక్తి తమ్మినేని అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి అనర్హుడని ఆనాడే చెప్పానని తెలిపారు. వైసీపీ దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. తమ్మినేని అక్రమాలపై మాట్లాడటానికి జగన్‌కు నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు. ఓ సామాన్యుడి స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో నీచంగా కొట్టేయాలని చూశారన్నారు. భూకబ్జాలో సూత్రధారి తమ్మినేని సీతారాం అని.. పాత్రధారి ఆయన కుమారుడని ఆరోపించారు. మాజీమంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారం రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. అప్పలరాజు కుమారుడు బైక్‌తో గుద్ది ఓ వ్యక్తిని చంపేస్తే.. ఆ స్థానంలో మరో వ్యక్తిని పెట్టి సాక్ష్యాలను తారుమారు చేశారని అన్నారు. 18 ఏళ్ల పిల్లాడని జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
సొంత బాబాయినే గొడ్డలితో నరికి సాక్ష్యాలను తారుమారు చేసిన చరిత్ర జాగన్ ది అంటూ రవికుమార్ విరుచుకుపడ్డారు. సాక్ష్యాలను తారుమారు చేసి చట్టాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు రాజకీయాలకు అర్హులా అని నిలదీశారు. నిరపరాధిని అపరాధిగా చేయాలని అప్పలరాజు ప్రయత్నించారన్నారు. చట్టం ఏ ఒక్కరి చుట్టం కాదని.. వైసీపీ నేతల అక్రమాలపై పోలీసులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ములుగును ముంచెత్తిన వాన!.. 7.66 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు
జీవో నం.3 పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు సానుకూలం: మంత్రి సంధ్యారాణి
Read Latest AP News And Telugu News