'మేము కూడా బాధితులమే'.. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:36 AM
తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. భూ వివాదంలో తామూ బాధితులమేనని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు.
శ్రీకాకుళం, జులై 28: తాను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తానని, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన క్రిమినల్ కేసుపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మధ్యవర్తులను నమ్మి కొన్నాం
భూమి కొనుగోలులో తాను ఎలాంటి అక్రమ మార్గాలను అనుసరించలేదని తమ్మినేని చెప్పారు. 'డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను నమ్మి, వాటి ఆధారంగానే మేము ఆ భూమిని కొనుగోలు చేశాం' అని ఆయన వివరించారు. ఒక సామాన్యుడిలాగే తాము కూడా పత్రాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియను చేపట్టామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యంతరాలు లేవు
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్ని పత్రాలను సమర్పించామని, అధికారులు వాటిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని తమ్మినేని అన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఎవరూ కూడా ఆ భూమిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తపరచలేదని ఆయన స్పష్టం చేశారు.
సివిల్ కోర్టులో కేసు
సదరు భూమిపై వివాదం ఉందని తెలిసిన వెంటనే, బాధ్యతాయుతమైన పౌరుడిగా తాము సివిల్ కోర్టును ఆశ్రయించామని మాజీ స్పీకర్ తెలిపారు. 'ఏడాదిన్నర కాలంగా ఈ భూమికి సంబంధించిన కేసు సివిల్ కోర్టులో విచారణలో ఉంది. న్యాయపరంగా తేల్చుకోవడానికే మేము కోర్టుకు వెళ్లాం' అని ఆయన చెప్పారు.
క్రిమినల్ కేసుపై ఆశ్చర్యం
ఒకవైపు సివిల్ కోర్టులో భూమి హక్కులపై విచారణ జరుగుతుండగానే, అదే అంశంపై ఇప్పుడు అకస్మాత్తుగా క్రిమినల్ కేసు నమోదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని తమ్మినేని సీతారాం అన్నారు. ఈ వ్యవహారంలో తాము కూడా బాధితులమేనని ఆయన ఆన్నారు. మధ్యవర్తులు, పత్రాలను నమ్మి మోసపోయామని, ఇప్పుడు అనవసరంగా నిందలు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.
దర్యాప్తునకు పూర్తి సహకారం
చట్టంపై తమకు పూర్తి గౌరవం ఉందని, పోలీసు దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. దర్యాప్తుకు అవసరమైన అన్ని పత్రాలను అధికారులకు సమర్పిస్తామని, తమ వాదనను చట్టపరంగా కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.
న్యాయవ్యవస్థపై విశ్వాసం
'నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే నమ్మకం మాకు ఉంది. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది' అని తమ్మినేని ధీమా వ్యక్తం చేశారు. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని చెప్పారు.
మీడియాకు విజ్ఞప్తి
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, వాస్తవాలు పూర్తిగా తేలకముందే మీడియా తొందరపడి తీర్పులు ఇవ్వవద్దని తమ్మినేని సీతారాం విజ్ఞప్తి చేశారు. రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News