సిక్కోలు ప్రగతికి ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలు
ABN , Publish Date - May 08 , 2026 | 12:37 AM
26th place in per capita income రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్‌లో జిల్లా ఇంకా చాలా వెనుకబడే ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన 7వ కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమీక్షలో జిల్లా ప్రగతికి సంబంధించిన వాస్తవ చిత్రపటం ఆవిష్కృతమైంది.
ఆదాయంలో వెనుకబాటే!
‘తలసరి’లో 26వ స్థానం
జిల్లా జీడీపీ ర్యాంకింగ్‌లోనూ ఇరవైకి పరిమితం
సీఎం - కలెక్టర్ల సదస్సులో వెల్లడైన గణాంకాలు
ఊరటనిస్తున్న సమగ్ర సర్వే పురోగతి, ‘పీఎం-సేతు’ నిధులు
శ్రీకాకుళం, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్‌లో జిల్లా ఇంకా చాలా వెనుకబడే ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన 7వ కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమీక్షలో జిల్లా ప్రగతికి సంబంధించిన వాస్తవ చిత్రపటం ఆవిష్కృతమైంది. ఈ సదస్సులో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో జిల్లాకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. ఆర్థిక పురోగతిలో వెనుకబాటుతనం ఆందోళన కలిగిస్తోంది. స్వర్ణాంధ్ర దిశగా సిక్కోలు ప్రగతి సాధించాల్సి ఉంది.
తలసరి ఆదాయంలో 26వ స్థానం :
పనితీరు ఇతర జిల్లాలతో పోలిస్తే కింద స్థానాల్లోనే ఉంది. 2025-26 అంచనాల ప్రకారం జిల్లా తలసరి ఆదాయం కేవలం రూ.1,82,508గా నమోదైంది. రాష్ట్రంలోని 28 జిల్లాల జాబితాలో శ్రీకాకుళం ఏకంగా 26వ స్థానంలో (అట్టడుగు నుంచి మూడో స్థానం) నిలవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అలాగే జిల్లా జీడీపీ(స్థూల ఉత్పత్తి) రూ.48,072 కోట్లుగా నమోదై రాష్ట్రస్థాయిలో 20వ స్థానానికే పరిమితమైంది. అలాగే ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖల వార్షిక పనితీరుకు సంబంధించి జిల్లా 84 శాతం స్కోరు సాధించింది. ఇది ‘గ్రేడ్-ఏ’(గుడ్) అయినప్పటికీ, రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌లో చూస్తే జిల్లా 19వ స్థానంలో నిలవడం గమనార్హం.
సానుకూల అంశాలు...
ఆర్థిక సూచీల్లో వెనుకబడినప్పటికీ, కొన్ని పరిపాలనాపరమైన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉంది.
స్కిల్ సెన్సెస్ కోసం చేపట్టిన సర్వేలో జిల్లా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మొత్తం 3,67,199 మందికి సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 3,31,341 మంది (90 శాతం) సర్వే పూర్తయింది. కేవలం 10 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉంది.
యువతలో పారిశ్రామిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఉద్దేశించిన పీఎం-సేతు పథకం కింద జిల్లాకు 1 స్కిల్ హబ్, 2 స్పోక్స్ మంజూరయ్యాయి. దీనికి ఏకంగా రూ.160కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో కేంద్రం రూ.80 కోట్లు, రాష్ట్రం రూ.53కోట్లు, పరిశ్రమలు రూ. 27కోట్లు భరించనున్నాయి.
వచ్చే ఏడాదికి నిర్దేశించిన భారీ లక్ష్యాలు :
జిల్లాను వెనుకబాటుతనం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. జిల్లా జీడీపీని రాబోయే ఏడాదికి 14.48 శాతం వృద్ధితో రూ. 55,035 కోట్లకు చేర్చాలి. తలసరి ఆదాయాన్ని 14.21 శాతం వృద్ధితో రూ. 2,08,435కు పెంచాలి
నైపుణ్య శిక్షణ (డీఎస్‌డీపీ) :
జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న 10 రంగాలు, 24 రకాల ఉద్యోగాలను గుర్తించారు. వీటిలో తక్షణమే ఏడాదిలోపు 2,190 మందికి, రాబోయే 2-3 ఏళ్లలో 2,955 మందికి, దీర్ఘకాలికంగా 3,690 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పేదరిక నిర్మూలన :
‘జీరో పావర్టీ’ మిషన్ కింద ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’ ద్వారా జిల్లాలోని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. శుక్రవారం జరగనున్న రెండోరోజు సదస్సులో జిల్లాకు సంబంధించిన తాగునీటి ఎద్దడి, సూపర్ సిక్స్ పథకాల అమలు, హౌసింగ్, భూ పరిపాలన, శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు.
దివ్యాంగుల ఆత్మగౌరవ ప్రతీక ‘స్వాభిమాన్’: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన సదస్సులో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రదర్శించిన ‘స్వాభిమాన్’ ప్రాజెక్టు అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస్’(ఉత్తమ విధానాలు) విభాగంలో భాగంగా జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారం కోసం విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి, అధికారులకు సవివరంగా వివరించారు.
ఆత్మగౌరవమే లక్ష్యంగా అంకురార్పణ
కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆలోచన నుంచి పుట్టిన ‘స్వాభిమాన్’ కార్యక్రమాన్ని 2024 ఆగస్టు 16న శ్రీకాకుళంలో ప్రారంభించారు. దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఆత్మగౌరవంతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ వేదికను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి నెలా మూడవ శుక్రవారం జెడ్పీ మీటింగ్ హాల్‌లో ప్రత్యేకంగా దివ్యాంగుల కోసమే ఈ సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 19 స్వాభిమాన్ సెషన్లలో సుమారు 654 అర్జీలు రాగా.. సామాజిక భద్రతా పింఛన్లు, ఉపాధి, సదరం సర్టిఫికెట్లు, బ్యాటరీ వాహనాలకు సంబంధించిన సమస్యలను అధికారులు వేగంగా పరిష్కరించారు.
చెంతకే ఆధునిక వైద్య సేవలు
గతంలో వినికిడి లోప నిర్ధారణ కోసం దివ్యాంగులు విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ చొరవతో .. ‘బోయింగ్’ సంస్థ సీఎస్సార్ నిధులతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లోనే ‘బెరా’ మిషన్‌ను ఏర్పాటు చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో అక్కడికక్కడే పరీక్షలు చేసి సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.
సంక్షేమంతోపాటు సాధికారత :
దివ్యాంగులకు కేవలం ప్రభుత్వ పథకాలు అందించడానికే పరిమితం కాకుండా, వారికి ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడం ‘స్వాభిమాన్’ సాధించిన అతిపెద్ద విజయం అని కలెక్టర్ స్పష్టం చేశారు. ‘యూత్ ఫర్ జాబ్స్’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 6 ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించారు. వీటికి హాజరైన 213 మందిలో ఎంపికైన 153 మందికి నెల రోజులపాటు నైపుణ్య శిక్షణ ఇచ్చారు. అనంతరం ట్రెండ్స్, మ్యాక్స్, వెస్ట్‌సైడ్, లైఫ్‌స్టైల్ లాంటి ప్రముఖ కంపెనీలతో పాటు పలు బీపీవో సంస్థల్లో వీరికి ఉద్యోగాలు ఇప్పించారు.
స్వయం ఉపాధి :
కొత్తూరు మండలం మాతల గ్రామానికి చెందిన పట్టా రాంబాబు అనే దివ్యాంగుడికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా రూ. 40 వేల రుణం ఇప్పించి, సొంతంగా టిఫిన్ సెంటర్ పెట్టుకునేలా అండగా నిలిచిన స్ఫూర్తిదాయక ఉదంతాన్ని కలెక్టర్ సభలో పంచుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేకపోవడం, అంధులకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం లాంటి క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంలోనూ ఈ ప్రాజెక్టు కీలకంగా పనిచేస్తోందని తెలిపారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ఈ ‘శ్రీకాకుళం మోడల్’ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఒక ఆదర్శవంతమైన నమూనాగా నిలుస్తుందని సదస్సులో ప్రశంసలు వ్యక్తమయ్యాయి.