శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు తల్లీకుమార్తె మృతి..
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:25 PM
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మందస మండలం బి.కేసుపురంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందారు.
శ్రీకాకుళం: జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మందస మండలం బి.కేసుపురంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందారు. గ్రామానికి చెందిన తల్లీకూతురు మడియ కృష్ణవేణి(35), మడియ యోగేశ్వరి(15) ఇవాళ(ఆదివారం) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనులు చేస్తుండగా ఒక్కసారిగా మేఘాలు అలుముకున్నాయి. భారీ వర్షం మెుదలైంది. దీంతో తల్లీకూతురు ఇద్దరూ అక్కడే ఉన్న ఓ చెట్టు కిందకు పరుగులు తీశారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఎటూ వెళ్లలేక వారిద్దరూ ఆ చెట్టు కిందే ఉండిపోయారు.
అయితే, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భారీ పిడుగు పడడంతో కృష్ణవేణి, యోగేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన పక్క చేనులో పనికి వచ్చిన వ్యవసాయ కూలీలు హుటాహుటిన వారి వద్దకు పరుగులు తీశారు. బాధితులిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. బంధువులు, గ్రామస్థులు సైతం కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరోవైపు తిరుపతి జిల్లాలోనూ పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాళహస్తి మండలం కలవగుంట గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు వి.కామరాజ్(35)పై పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..
నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం.. తప్పిన భారీ ప్రాణనష్టం