Share News

నీటి సంరక్షణపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:03 PM

నీటి సంరక్షణ- జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు నీటి సంరక్షణకు యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' పేరుతో నీటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.

నీటి సంరక్షణపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు..
CM Chandrababu Naidu

అమరావతి: నీటి సంరక్షణ- జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు నీటి సంరక్షణకు యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' పేరుతో నీటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ మేరకు సాగునీటి సంఘాలు కేంద్రీకృతంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు రచించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(ఆదివారం) రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇరిగేషన్, అటవీ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశు సంవర్థక శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..'నీటిభద్రత- సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల కార్యాచరణ రేపటి నుంచి జులై వరకు సాగుతుంది. నీటి భద్రత అనేది ప్రభుత్వ బాధ్యతే కాదు.. ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. దీనికి సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలి. ప్రతి చుక్కనూ ఒడిసి పట్టుకోవాలి.. ప్రతి బొట్టును సంరక్షించుకోవాలి. భూగర్భ జలాలను పెంచాలి. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 తేదీ వరకు పనుల గుర్తింపు కార్యక్రమం చేపట్టాలి. ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలి. ఏప్రిల్ 21 నుంచి జులై 9వ తేదీ వరకు పనులను చేపట్టాలి. జులై 10 నుంచి 14 జులై మధ్య పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి.


100 రోజుల్లో ఈ పనులు చేపట్టాలి. ఆ తర్వాత వర్షాలు పడతాయి. భూగర్భ జలాలనూ సంరక్షించుకోవాలి. నీటి భద్రత చేపట్టాలి. రిజర్వాయర్లలో నిండుగా నీళ్లున్నాయి. గతానికంటే భూగర్భ జలాలు పెరిగాయి. నీటి భద్రత ఇవ్వగలిగితే.. మిగిలిన రంగాల్లో అభివృద్ధి దానంతటికి అదే జరుగుతుంది. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వేసవికి ముందు 6 మీటర్లు, వర్ష కాలం తర్వాత 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. నీటిని నిల్వ చేయాలి.. పొదుపు చేయాలి. మైక్రో ఇరిగేషన్ అమలు చేయాలి.. ప్రతి చుక్కనూ సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. కనీసం 1.5 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ పెంచాలి.


జలధార అని పేరు పెట్టి నీటి భద్రత, సంరక్షణ చర్యలను అన్నమయ్య జిల్లా అద్భుతంగా చేపట్టింది. భూగర్భ జలాలను పెద్దఎత్తున పెంచారు. స్థానికంగా ఉన్న జలవనరులను వినియోగించుకున్నారు. అన్ని చెరువులను నింపారు.. భూగర్భ జలాలను పెంచారు. అన్నమయ్య జిల్లా స్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఫీడర్ ఛానెళ్లను క్లియర్ చేయాలి. పూడిక తీత పనులు చేపట్టాలి. గుర్రపు డెక్క తొలగించాలి. చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. అప్పుడే ఎక్కువ నీటిని సంరక్షించుకోవచ్చు, ముంపును అరికట్టవచ్చు. అవసరమైన మేరకు చెక్ డ్యాంలను రిపేర్లు చేయాలి. కొత్త స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టాలి. భూగర్భజలాలు మరీ తక్కువగా ఉన్న చోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సాగునీటి సంఘాలు వాటర్ బడ్జెట్ తయారు చేసుకోవాలి.


ఆయా సాగునీటి సంఘాల పరిధిలో నీటి లభ్యత ఏ మేరకు ఉందో అంచనా వేసుకోవాలి. ఎంత డిమాండ్ ఉందో లెక్కలు వేసుకోవాలి. మైక్రో ఇరిగేషన్ పెంచాలి.. వృథాగా నీరు పోకుండా చూడాలి. 100 రోజుల్లో మిషన్ అప్రోచ్‌తో పని చేయాలి. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. కొద్దిపాటి శ్రద్ధ పెడితే నీటి సమస్య లేకుండా చేయవచ్చు. కరవు రహిత రాష్ట్రంగా మార్చవచ్చు. ఒకప్పుడు రాయలసీమ ఎడారి అవుతుందన్నారు. ఇప్పుడు హార్టీకల్చర్ హబ్‌గా మారింది. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా చేపడుతున్నాం. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగా వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ హయాంలో చేపట్టాం.


ఇప్పుడు పోలవరం సహా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పని చేస్తున్నాం. సాగునీటి సంఘాలు కూడా అదే తరహాలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షపునీరు సంరక్షించుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. 2024 మే నుంచి 2025 మే వరకూ 2.20 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.. అంటే 200 టీఎంసీల నీటిని పెంచుకోగలిగాం. ప్రజాచైతన్యం.. ప్రజల భాగస్వామ్యంతో 100 రోజుల ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి' అని చంద్రబాబు సూచించారు. కాగా, నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యతపై సోమవారం నాడు తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..

నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం.. తప్పిన భారీ ప్రాణనష్టం

Updated Date - Apr 05 , 2026 | 06:04 PM