ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:27 PM
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడు బోట్లను ఎదుర్కొనేందుకు టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు మంత్రి వెల్లడించారు. మన రాష్ట్ర మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు కొల్లగొడుతున్నారని.. అందుకే ఆధునిక స్పీడ్ బోట్ల సహాయంతో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోందని పేర్కొన్నారు.
మెరైన్ బోట్ల ద్వారా చేపల అక్రమ వేటకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి మరీ ఏపీ మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ అనుమానాలు సృష్టిస్తోందని మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జువ్వలదిన్నె హార్బర్ వద్ద సాగర్ డిఫెన్స్‌కి 7.5 ఎకరాలు మాత్రమే ఏపీ ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. పులికాట్‌లో పూడిక తొలగించేందుకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. కృష్ణపట్నం పోర్ట్ వద్ద జెట్టీల ఏర్పాటుకూ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
ఏపీ తీరంలో తమిళనాడు, పాండిచ్చేరి బోట్ల ఆగడాలు, అక్రమ చేపల వేటని అస్సలు ఊపేక్షించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని మెరైన్ ఐజీ గోపీనాథ్ తెలిపారు. దీంతో తీరంలో 24గంటలూ గస్తీ ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 4 బోట్లలో టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మర గస్తీ కాస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో 4 బోట్లు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఐజీ వెల్లడించారు. ఇటీవల కాలంలో మూడు ఇతర రాష్ట్రాల బోట్లని టాస్క్ ఫోర్స్ బృందాలు పట్టుకున్నట్లు తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్‌లో మెరైన్ ఐజీ గోపీనాథ్, డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గొట్టిపాటి చెంచుబాబు, శ్రీధర్, శ్రీనివాసులు, బాలిరెడ్డి పర్యటించారు. సముద్రంలో సుమారు 30 నాటికల్ మైళ్లు బోటులో వెళ్లి పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
టెర్రర్ లింక్స్ కేసు.. కేసులో బలం లేదన్న నిందితుల తరఫు న్యాయవాది..
మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న