Share News

దురంధర్-2.. దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్‌ల గ్యాంగ్ వార్ చరిత్ర ఇదీ

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:01 PM

అండర్‌వరల్డ్ డాన్‌లు దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్ మధ్య గ్యాంగ్‌ వార్ అంశం దురంధర్ మూవీతో మరోసారి తెరపైకి వచ్చింది. వీరి మధ్య వైరంపై అప్పట్లో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.

దురంధర్-2.. దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్‌ల గ్యాంగ్ వార్ చరిత్ర ఇదీ
Dawood Ibrahim vs Salman Dakait

ఇంటర్నెట్ డెస్క్: దురంధర్-2 మూవీ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండర్‌వరల్డ్ డాన్‌లు దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్ మధ్య గ్యాంగ్‌ వార్ అంశం ఈ మూవీతో మరోసారి తెరపైకి వచ్చింది. వీరి మధ్య వైరంపై అప్పట్లో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ వర్గాల కథనాలు కూడా పెద్ద చర్చకు దారి తీశాయి.

ఏమిటీ వివాదం?

కరాచీలో దాదాపు రూ.400 కోట్ల విలువైన ఒక స్థలం విషయంలో దావూద్ ఇబ్రహీం, సల్మాన్ డకైత్‌ల మధ్య వివాదం మొదలైనట్టు సమాచారం. ఆ భూమి సల్మాన్ దకైత్ బంధువుకు చెందినది. దాన్ని రూ.12 కోట్లకే సొంతం చేసుకుందామని దావూద్ గ్యాంగ్ ప్రయత్నించింది. తాము ఇచ్చిన డబ్బు పుచ్చుకోవాలని జాగా యజమానిని దావూద్ గ్యాంగ్ బెదిరించిందని సమాచారం. విషయం సల్మాన్ డకైత్‌కు తెలియడంతో అతడు రంగంలోకి దిగాడు. నేరుగా దావూద్‌ను హెచ్చరించాడు. కానీ దావూద్ వెనక్కు తగ్గకపోవడంతో వివాదం ముదిరింది.

చివరకు సల్మాన్ డకైత్ దావూద్ సోదరుడిని కిడ్నాప్ చేసి హత్య చేసే వరకూ వివాదం ముదిరింది. దావూద్ సోదరుడిని సల్మాన్ డకైత్ గ్యాంగ్ దారుణంగా టార్చర్ చేసి చంపేసి, మృతదేహాన్ని దావూద్ ఇంటికి సమీపంలో పడేసినట్టు కూడా అప్పట్లో మీడియాలో వార్తలు వెలువడ్డాయి.


ఈ హత్యకు మునుపే దావూద్ సల్మాన్ డకైత్‌తో రాజీ కోసం ప్రయత్నించాడు. సోదరుడిని కాపాడుకునేందుకు అప్పట్లో ఏకంగా రూ.580 కోట్లు ఆఫర్ చేసినట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇది ఒక రకంగా డకైత్ ముందు ఓటమిని ఒప్పుకోవడమేనని కూడా అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అయితే, దావూద్ కుటుంబం మాత్రం బహిరంగంగా ఈ కథనాలను ఖండించింది. గుండెపోటుతోనే దావూద్ సోదరుడు మరణించాడని పలుమార్లు స్పష్టం చేసింది. నిజానిజాలు ఏమైనప్పటికీ దావూద్‌కు అండర్‌వరల్డ్‌లో తిరుగేలేదన్న భావనకు ఈ ఉదంతంతో బ్రేక్ పడింది.

ఇక ఈ ఉదంతం జరిగిన కొంత కాలానికి డకైత్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు. అప్పటి ఎస్ఎస్‌పీ చౌదరీ అస్లామ్ నేతృత్వంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే, ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అని సల్మాన్ డకైత్ కుటుంబసభ్యులు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, నాడు అసలేం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

సల్మాన్ డకైత్‌ ఎన్‌కౌంటర్‌కు దావూద్‌కు సంబంధం ఉన్నట్టు ఎలాంటి అధికారిక ప్రకటనలూ లేకపోయినప్పటికీ జనాల్లో మాత్రం రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. దావూద్ సైలెంట్‌గా తాను చేయవలిసింది చేశాడన్న కామెంట్స్ వినిపించాయి. ఇక దురంధర్ మూవీ నేపథ్యంలో నాటి మిస్టరీపై మరోసారి జనాల దృష్టి మళ్లింది.

Updated Date - Apr 05 , 2026 | 06:15 PM